బోనమెత్తిన భాగ్యనగరం.. గోల్కొండ కోటలో తొలి బోనం.. కరుణించిన వరుణుడు

Wait 5 sec.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవాలు బుధవారం (జూలై 16) ఘనంగా ప్రారంభం అయ్యాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో హైదరాబాద్ నగరం భక్తిరసంలో మునిగిపోయింది. తొలి రోజే వరుణుడు కూడా కరుణించడంతో భక్తులు మరింత ఆనందోత్సాహాలతో అమ్మవారిని దర్శించుకున్నారు. గోల్కొండ కోటలో ప్రారంభమైన బోనాల వేడుకలతో హైదరాబాద్ అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పోతురాజుల వీరనృత్యాలు, శివసత్తుల పూనకాలు, ఘటాల ఊరేగింపులు, డప్పుల మోతల మధ్య అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముత్యాలమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ వంటి గ్రామదేవతలకు మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం.. పాతబస్తీ లాల్‌దర్వాజా అమ్మవారి ఆలయంతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని సుమారు 3 వేల ఆలయాల్లో బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పండుగను వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులు కేటాయించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో సేవలు అందిస్తున్నాయి. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య శిబిరాలతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల కోసం పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాలు తెలంగాణ ఆత్మగౌరవానికి, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రకృతి అనుగ్రహం, ప్రజల సౌభాగ్యం, పంటల సమృద్ధి కోసం అమ్మవారిని వేడుకునే ఈ పండుగ తెలంగాణ ప్రజల సంస్కృతిని ప్రతిబింబించే విశిష్ట ఉత్సవంగా కొనసాగుతోంది.