అమెరికా కంటే చైనావైపే ప్రపంచం మొగ్గు..విశ్వసనీయతలో ట్రంప్‌‌ను దాటేసిన జిన్‌పింగ్

Wait 5 sec.

ప్రపంచం అమెరికాను నమ్మడం లేదా? చైనావైపు మొగ్గుచూపుతుందా? డొనాల్డ్ ట్రంప్ విశ్వసనీయతను కోల్పోయారా? చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌‌‌‌కు ఆదరణ పెరుగుతుందా? అంటే అవుననే అంటోంది ప్యూ రిసెర్చ్ సెంటర్ సర్వే. ఈ ఏడాది ఆరంభంలో ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలు, ఇతర భూభాగాల్లో ప్యూ రిసెర్చ్ నిర్వహించిన సర్వేలో అమెరికా కంటే చైనా పట్ల ఎక్కువ సానుకూల వైఖరి ఉందని తేలింది. అలాగే, ఆ దేశాధినేతలు డొనాల్డ్ ట్రంప్, షీ జిన్‌పింగ్‌ల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాల్లోనూ ఇలాంటి ధోరణులే వ్యక్తమయ్యాయి.ఫిబ్రవరి 8 2026 నుంచి మే 13 మధ్య 36 దేశాల్లోని 42,151 మంది అభిప్రాయాలను ప్యూ సేకరించింది. సర్వే ప్రకారం అనేక దేశాలలో చైనా పట్ల సానుకూల అభిప్రాయాలు రికార్డు స్థాయికి చేరుకోగా.. అదే సమయంలో అమెరికా పట్ల ప్రతికూలత పెరిగింది. సర్వే నిర్వహించిన 36 దేశాల్లో 25 దేశాల ప్రజలు అమెరికా కంటే చైనాపైనే ఎక్కువ సానుకూల అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. 2002లో ప్యూ రిసెర్చ్ సెంటర్ ఈ అభిప్రాయసేకరణ ప్రారంభించినప్పటి నుంచి.. ఇంత పెద్ద సంఖ్యలో చైనాకు మద్దతుగా నిలవడం ఇదే మొదటిసారి.ఈ సర్వేలో పాల్గొన్నవారిని అమెరికా, చైనాల పట్ల వారు చాలా సానుకూల, కొంత సానుకూల, కొంత ప్రతికూల లేదా చాలా ప్రతికూల అభిప్రాయం కలిగి ఉన్నారా? అని ప్రశ్నించారు. స్పెయిన్, ఇండోనేషియా, ఇటలీ, గ్రీస్, కెనడా వంటి దేశాలు చైనా పట్ల భారీగా మొగ్గుచూపుతున్నాయి. తమ పొరుగు దేశం అమెరికా కంటే కెనడా, మెక్సికోలు ఇప్పుడు చైనాను మరింత సానుకూలంగా చూస్తున్నాయి.కేవలం ఆరు దేశాలు మాత్రమే ఇప్పటికీ చైనా కంటే అమెరికాను మరింత సానుకూలంగా చూస్తున్నాయి. పోలాండ్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, భారత్, జపాన్, ఇజ్రాయెల్. ఇవన్నీ అమెరికాకు దీర్ఘకాలిక భాగస్వాములు లేదా మిత్రదేశాలు కావడం గమనార్హం.ట్రంప్, జిన్‌పింగ్ మధ్య పోలికప్రపంచ వ్యవహారాలలో ఎవరు సరైన నిర్ణయం తీసుకుంటారనే విషయంలో డొనాల్డ్ ట్రంప్, షీ జిన్‌పింగ్‌ ఇద్దరిపై కూడా నమ్మకం తక్కువగానే ఉన్నట్టు వెల్లడయ్యింది. చాలా దేశాలలో ఇద్దరి రేటింగ్ 50 శాతం కంటే తక్కువగా నమోదయ్యింది. అంతర్జాతీయ నిర్ణయాలు తీసుకునే విషయంలో ట్రంప్, షీ‌పై నమ్మకం తక్కువే ఉందని ఇది సూచిస్తుంది. అయినప్పటికీ, ట్రంప్‌తో పోలిస్తే జిన్‌పింగ్‌పైనే ఎక్కువ దేశాలు నమ్మకం వ్యక్తం చేయడం గమనార్హం.సర్వే చేపట్టిన 36 దేశాలు, భూభాగాల్లో 22 దేశాల ప్రజలు ట్రంప్‌ కంటే షీపై ఎక్కువ సానుకూలత వ్యక్తం చేశారు. వీటిలో కెనడా, మెక్సికో, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి ప్రధాన యూరోపియన్ శక్తులు ఉన్నాయి. అయినప్పటికీ, షీ రేటింగ్‌ పూర్తి మెజారిటీ స్థాయికి చేరుకుంది. ఈ సర్వేలో షీకి అత్యధిక రేటింగ్ పాకిస్తాన్ నుంచి సుమారు 83% రాగా.. అత్యల్పంగా జపాన్‌లో సుమారు 7% మాత్రమే.అమెరికా, చైనా పట్ల వైఖరి ప్రకారం చైనా పట్ల ప్రస్తుతం సానుకూల దృక్పథం పెరిగింది. సర్వేలో పాల్గొన్న వారిలో 46% మంది ఆ దేశం పట్ల సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు.ట్రంప్ రేటింగ్‌‌ విషయానికి వస్తే.. ఫిలిప్పీన్స్‌లో అత్యధికంగా 68%.. అత్యల్పంగా వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలంలో కేవలం 4% మాత్రమే లభించింది. అనేక దేశాలలో ముఖ్యంగా ఐరోపాలో ఏ ఒక్కరికీ రేటింగ్ 50 శాతం దాటలేదు. అయినప్పటికీ ట్రంప్‌పై షీ రెండంకెల మార్జిన్‌లో ముందున్నారు. ఇతర ప్రపంచ నాయకులతో పోలిస్తే షీపై అంత బలమైన లేదా స్పష్టమైన అభిప్రాయాలు లేవని పరిశోధకులు గుర్తించారు. దీనికి విరుద్ధంగా ట్రంప్‌పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి, మరింత తీవ్రమైన అనుకూల లేదా ప్రతికూల వైఖరులను ఎంచుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.వ్యక్తిగత స్వేచ్ఛచైనా కంటే అమెరికాపై ఇంకా సానుకూల వైఖరి వ్యక్తం చేస్తోన్న ఏకైక విభాగం వ్యక్తిగత స్వేచ్ఛకు ఇచ్చే గౌరవం. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడంలో చైనా కంటే అమెరికాదే ఎప్పుడూ పైచేయి . అయితే, 2021తో పోల్చితే ఈ వ్యత్యాసం వేగంగా తగ్గుతూ వచ్చింది. ఐదేళ్ల కిందటితో పోల్చితే అమెరికా ప్రభుత్వం పౌరుల స్వేచ్ఛను గౌరవిస్తుందని చెప్పే వారి సంఖ్య భారీగా తగ్గింది. స్వీడన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్పెయిన్ వంటి దేశాలలో ఈ సానుకూల అభిప్రాయం 25 శాతం పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ పడిపోయింది. అదే సమయంలో ఆస్ట్రేలియాతో సహా పలు దేశాలలో చైనా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తుందని చెప్పే వారి శాతం స్వల్పంగా పెరగడం గమనార్హం.విదేశీ జోక్యంపలు లాటిన్ అమెరికా, మధ్య ఆదాయ సహా వివిధ దేశాలలో ఈ రెండు అగ్రరాజ్యాల విదేశాంగ విధానాల పాత్రపై ప్రజల్లో ఉన్న అవగాహనను కూడా ప్యూ పరిశీలించింది. గతంలో ఈ ప్రాంతాల ప్రజలు చైనా కంటే అమెరికానే అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా భావించేవారు. కానీ ప్రస్తుతం ప్రజల అభిప్రాయాలు చీలిపోయాయని, ఎలాంటి స్పష్టమైన ఏకాభిప్రాయం లేదని సూచిస్తున్నాయి. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా ఎక్కువగా జోక్యం (సగటున 75 శాతం మంది) చేసుకుంటోందని చెప్పగా.. చైనా పట్ల కేవలం 45% మంది మాత్రమే అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రపంచ నాయకత్వ ఆమోద రేటింగ్స్‌లో ఇటీవలే అమెరికాను చైనా అధిగమించినట్లు గాలప్ పోల్ నివేదిక పేర్కొంది. అమెరికా నాయకత్వంపై విశ్వాసం తగ్గడం, చైనా పట్ల స్వల్పంగా ఆదరణ పెరగడం వల్ల... గత రెండు దశాబ్దాల్లో బీజింగ్ పట్ల వచ్చిన అతిపెద్ద రేటింగ్ వ్యత్యాసం ఇదే కావడం గమనార్హం.