తల్లికి వందనం నిధులు విడుదల.. రూ.10 వేల కోట్లు రిలీజ్.. ఆ రోజే అకౌంట్లలోకి..!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతిష్ఠాత్మక ‘తల్లికి వందనం’ పథకం అమలుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఈ పథకం కోసం రూ.10,120.78 కోట్ల పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. ఇందులో భాగంగా రూ.10,049 కోట్ల నిధులను విడుదల చేసింది. అర్హులైన తల్లులు లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో ఈనెల 22వ తేదీన నేరుగా డీబీటీ ద్వారా నగదు జమ చేయనున్నట్లు ప్రకటించింది.ఈ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులకు వర్తించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులు.. 42,70,802 మంది తల్లులు లేదా సంరక్షకులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందించనుండగా.. అందులో రూ.2 వేల చొప్పున పాఠశాలల నిర్వహణ, అభివృద్ధి కోసం కేటాయించి.. మిగిలిన రూ.13 వేల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 22వ తేదీన తొలి విడతగా అర్హులు, అనర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. అదే రోజు నుంచి ఆగస్ట్ 3వ తేదీ వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఆగస్ట్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వాటిని పరిశీలించి అదనపు అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు.కొత్తగా 1వ తరగతి.. 9వ తరగతి.. ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. వారి అర్హతలను పరిశీలించి ఆగస్టు 30వ తేదీన అదనపు లబ్ధిదారుల జాబితా విడుదల చేసి.. అదే రోజు వారి తల్లుల ఖాతాల్లో కూడా ఆర్థిక సాయాన్ని జమ చేయనుంది.అలాగే ఆర్టీఈ చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల చదువుకు ఆర్థిక భారం తగ్గించి.. ప్రతి కుటుంబానికి విద్యా భరోసా కల్పించడమే ‘తల్లికి వందనం’ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.