రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదరకుండా నివారించే ప్రయత్నాలలో భారత్ పోషిస్తున్న పాత్రను పోలాండ్ ప్రశంసించింది. ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వ్లాడిస్లావ్ టియోఫిల్ బార్టోస్జెవ్‌స్కీ మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవించే కొద్దిమంది ప్రపంచ నాయకులలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరని అన్నారు. 2022 చివరిలో జరిగిన పరిణామాలను పొలాండ్ మంత్రి ప్రస్తావిస్తూ.. యుద్ధ సమయంలో వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉపయోగించవద్దని రష్యాను ఒప్పించడంలో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. రష్యాతో భారత్‌కు ఉన్న దశాబ్దాల నాటి సంబంధం న్యూఢిల్లీకి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తోందని, శాంతిని నెలకొల్పే ప్రయత్నాలలో దీనిని ఒక కీలక శక్తిగా నిలుపుతోందని బార్టోస్జెవ్‌స్కీ అన్నారు. ‘‘ ప్రపంచ ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు.. అలీన విధానం అనుసరించిన కాలం నుంచి భారతదేశానికి రష్యాతో, అంతకుముందు సోవియట్ యూనియన్‌తో కూడా చాలాకాలంగా సంబంధాలు ఉన్నాయి. అధ్యక్షుడు పుతిన్ వాస్తవానికి మోదీ చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.మాస్కోతో సంప్రదింపులు రోజురోజుకు కష్టతరం అవుతున్న తరుణంలో, రష్యా అధ్యక్షుడిని ప్రభావితం చేయగల కొద్దిమంది నాయకులలో ప్రధాని మోదీ కూడా ఒకరని పోలిష్ మంత్రి పేర్కొన్నారు. ‘‘రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై కొంత ఒత్తిడిని, ప్రభావాన్ని చూపగల కొద్దిమంది వ్యక్తులలో ప్రధానమంత్రి మోదీ ఒకరు. ఈ సంఘర్షణను ఆపడానికి భారత్ స్పష్టంగా చేయగలిగే సహాయం ఇదే’’ బార్టోస్జెవ్‌స్కీ అభిప్రాయపడ్డారు.రష్యా తనను శత్రువులుగా భావించే దేశాల నుంచి వచ్చే విజ్ఞప్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, భారత్‌తో పాటు చైనా వాణిని కూడా మాస్కో గౌరవిస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఉద్రిక్తతలు పెరగడం ఎవరికీ ఇష్టం లేదని భారత్‌, చైనా వంటి దేశాలూ శాంతిని కోరుకుంటున్నాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి మోదీతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. భారత్‌తో చమురు విభేదాలు సద్దుమణిగాయని పోలాండ్ పేర్కొంది.రష్యా నుంచి తక్కువ ధరకు క్రూడాయిల్‌ను భారత్ దిగుమతి చేసుకోవడంపై గతంలో ఉన్న విభేదాలను న్యూఢిల్లీ,వార్సా అధిగమించాయని స్పష్టం చేశారు. రష్యా ఆర్థిక వ్యవస్థకు భారత్ పరోక్షంగా మద్దతు ఇస్తోందంటూ గతంలో తాము చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెరిగిందని ఆయన పేర్కొన్నారు.