Tirumala శ్రీవారి భక్తులకు గమనిక.. రెండ్రోజుల పాటూ బ్రేక్ దర్శనాలు రద్దు, ఒక్కరోజు సేవలు రద్దు

Wait 5 sec.

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. రెండు రోజుల పాటూ వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. జులై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జులై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. కాబట్టి జులై 14, జులై 17న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరులకు టీటీడీ ఈ కారణంగా ఈ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. జులై 13, 16వ తేదిల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించరు. అదే విధంగా జులై 17న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేయడం చేసినట్లు టీటీడీ తెలిపింది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని భక్తులు సహకరించాలని టీటీడీ కోరింది. తిరుమలలో జులై నెల నుంచి సెప్టంబ‌ర్ 30వ తేది వ‌ర‌కు వివిధ ప‌ర్వదినాలు, ఉత్సవాల‌ను పుర‌స్కరించుకుని శ్రీ‌వారి ఆల‌యంలో బ్రేక్ ద‌ర్శనాల ర‌ద్దు వివరాలను టీటీడీ ప్రకటించింది. జులై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం.. జులై 17న‌ ఆణివార ఆస్థానం కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. జులై 19న శ్రీ ఆండ‌వ‌న్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మ‌ర్యాద‌ కారణంగా రద్దు చేశారు. జులై 29న జీయ‌ర్ స్వాముల చాతుర్మాస సంక‌ల్పం.. అలాగే ఆగ‌స్టు 22న ప‌విత్రోత్సవాల‌కు అంకురార్పణ‌ కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దయ్యాయి. ఆగ‌స్టు 24న ప‌విత్రోత్సవాల రెండో రోజు సంద‌ర్భంగా ప‌విత్రాల స‌మ‌ర్పణ‌ కారణంగా రద్దు చేశారు. అలాగే సెప్టెంబ‌ర్ 8న శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం.. సెప్టెంబ‌ర్ 14న శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల‌కు అంకురార్పణ‌.. సెప్టెంబ‌ర్ 15 నుంచి 23వ తేది వ‌ర‌కు శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఈ తేదీల‌కు సంబంధించి ముందు రోజు తిరుమ‌ల‌లో ప్రోటోకాల్ ప్రముఖుల‌కు మిన‌హా వీఐపీ సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌రని టీటీడీ తెలిపింది. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని భ‌క్తులు త‌మ తిరుమ‌ల యాత్రకు ప్రణాళిక రూపొందించుకోవాలని కోరింది టీటీడీ.