ఆయనో మండల వ్యవసాయాధికారి (ఏఓ).. ఆయనకు సంబంధించిన రూ. కోటి ఆస్తిని సొంత బావమరిదే పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. దాంతో పాటు అవసరమంటే కొంత డబ్బు కూడా ఇచ్చారు. బావ బతుకు కోరేవాడే కదా బావమరిది అని ఆ ఏఓ అనుకున్నారు. కానీ, బావ డబ్బుపై అతనికి దుర్భుద్ధి పుట్టింది. అసలు బావే లేకుండా ఆ ఆస్తి, డబ్బంతా తనదే కదా అని అనుకున్నాడు. పక్కా ప్లాన్‌తో కుక్కల్ని చంపే ఇంజెక్షన్‌‌తో హతమార్చాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా కాల్చేశారు. కానీ మళ్లీ అదే ఆస్తి పంపకాల్లో అసలు విషయం నిజం బయటపడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఏఓగా పనిచేస్తున్న శ్రీహరి తన సొంత బావమరిది హరికృష్ణను నమ్మి సుమారు రూ. కోటి విలువైన ఆస్తిని రాసిచ్చారు. దాంతో పాటు అప్పుగా కొంత డబ్బు కూడా ఇచ్చారు. కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. ఇటీవల మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకున్న శ్రీహరి బావమరికి ఇచ్చిన ఆస్తి, డబ్బు ఇవ్వాలని కోరారు. అయితే, ఆ ఆస్తి, డబ్బు వెనక్కి ఇవ్వడం ఇష్టం లేని హరికష్ణ బావను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. READ ALSO తన ప్లాన్‌లో భాగంగా జూన్ 15న పెంచలకోన నరసింహస్వామి దర్శనానికి వెళ్లొద్దామని శ్రీహరిని కారులో ఎక్కించుకున్నాడు హరికృష్ణ. దర్శనం అంతా పూర్తిచేసుకుని తిరిగి వచ్చే దారిలో సరిగ్గా చేజర్ల మండలంలో సడెన్‌గా హరికృష్ణ కారు ఆపాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం అక్కడ రవీంద్ర, యానాది అనే ఇద్దర్ని సిద్ధంగా ఉంచాడు. కారు ఆపగానే కుక్కలను చంపేందుకు ఉపయోగించే ఇంజెక్షన్లు రెండు శ్రీహరికి వేయడంతో ఆయన మరణించాడు. గుడికి వెళ్లి వస్తుండగా గుండెపోటు వచ్చిందని చిత్రీకరించి అందర్నీ నమ్మించాడు. ఆ వెంటనే బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని శ్రీహరి సొంతూరైన మినగల్లుకు తీసుకొచ్చారు. తోటి ఉద్యోగులు అక్కడికి చేరుకుని శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చినా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదు. మృతదేహాన్ని పూడ్చాల్సి ఉంటే కాల్చేశారు. అంతా హరికృష్ణ అనుకున్న ప్రకారమే జరిగిపోయింది. అయితే, ఇటీవల శ్రీహరికి సంబంధించిన మిగిలిన ఆస్తి తనకు రాసివ్వాలంటూ హరికృష్ణ గొడవకు దిగాడు. దాంతో శ్రీహరి భార్య లావణ్య ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా.. డీఎస్పీ దర్యాప్తు చేపట్టారు. ఆ విచారణలో అసలు నిజం బయటపడింది.. ఈ కేసులో రవీంద్ర, యానాదిలను అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న హరికృష్ణ కోసం గాలిస్తున్నారు.