కేవలం రూ.7500 కడితే.. రూ.1 లక్ష ఇస్తామని RBI లెటర్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

Wait 5 sec.

Fact Check: కేవలం రూ.7500 కడితే బ్యాంక్ ఖాతాలోకి రూ.1 లక్ష వస్తాయి అంటే చాలా మంది ఆకర్షితులవుతారు. అందులోనూ కరెన్సీ నోట్లను ముద్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వంటి సంస్థ నుంచి ఇలాంటి ప్రకటన వస్తే ఇంకేమైనా ఉందా జనాలు ఎగబడతారు. తాజాగా అలాంటి ఓ ప్రకటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం రూ.7500 ట్యాక్స్ చెల్లించినట్లయితే రిజర్వ్ బ్యాంక్ పేరుతో ఓ లేఖ ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. దీంతో చాలా మంది దీనిపై ఆరా తీస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం. రూ.7500 కడితే లక్ష ఇస్తామంటూ ఆర్‌బీఐ పేరుతో చక్కర్లు కొడుతున్న లేఖ ఫేక్ అని, రీఫండబుల్ ట్యాక్స్ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి వార్తలను నమ్మొద్దని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 'రూ.7,500 రీఫండబుల్ ట్యాక్స్ కడితే ఆర్‌బీఐ రూ.1 లక్ష విడుదల చేస్తుందంటూ సోషల్ మీడియాలో తాజాగా ఓ లేఖ విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ లేఖతో ఆర్‌బీఐకి గానీ, ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి సందేశాలు, లేఖలకు స్పందించి ఎలాంటి చెల్లింపులూ చేయవద్దు' అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ హెచ్చరిస్తూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. ముందస్తు చెల్లింపులు, ట్యాక్సులు లేదా ప్రాసెసింగ్ ఫీజులకు బదులుగా నగదు ఇస్తామని ఆర్‌బీఐ ఎప్పుడూ ప్రకటనలు చేయదని స్పష్టం చేసింది. ప్రజలను నమ్మించి బోల్తా కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ రంగ సంస్థల పేర్లు, లోగోలను వినియోగించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నట్లు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. ఇటువంటి ప్రచారాలపై స్పందించే ముందు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ధ్రువీకరించుకోవాలని కోరింది. ఎవరైనా ఇలాంటి వాటిని నమ్మి మోసపోయినట్లయితే వెంటనే స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా తప్పుడు సమాచారాన్ని గుర్తించినట్లయితే పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌కు రిపోర్ట్ చేయాలని సూచించింది. Factcheck@pib.gov.inకి మెయిల్ లేదా 8799711259కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపింది. సామాన్య ప్రజలను నమ్మించేందుకు ఏకంగా దేశ కేంద్ర బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరునే వాడేసుకున్నారు. అంతే కాదు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త స్కీమ్ తెచ్చారని, కేవలం రూ.22 వేలు కడితే నెల రోజుల్లోనే రూ.25 లక్షలు వస్తాయంటూ ఇటీవల పలు డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం, పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నా సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త అవతారాలు ఎత్తుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.