ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరోసారి తీపికబురు చెప్పింది.. రాష్ట్రానికి మరోసారి ఎంబీబీఎస్ సీట్లను పెంచింది. తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అదనంగా మరో 175 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించారు. ఈ మేరకు ఎంబీబీఎస్ సీట్ల పెంపుదలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) లెటర్ ఆఫ్ పర్మిషన్ (LoP) జారీ చేసినట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ 175 సీట్లలో పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 100 ఎంబీబీఎస్ సీట్లు, విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కాలేజీకి అదనంగా 75 సీట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు.రాష్ట్రంలో నీట్ రాసిన విద్యార్థులకు మేలు జరుగుతుందని.. వైద్య విద్య అవకాశాలు మరింత పెరగనున్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కలిపి 325 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మొత్తం 505 అదనపు సీట్లు పెరిగాయన్నారు. అదే సమయంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 550 అదనంగా ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు కలిపి మొత్తం 1,055 అదనపు సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఏపీలో మెడికల్ సీట్లు పెరగడం వల్ల నీట్ మెరిట్ విద్యార్థులకు భారీ ఊరట లభిస్తుందన్నారు మంత్రి సత్యకుమార్. ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 50 శాతం సీట్లు అందుబాటులో ఉండటం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ట్రానికి అదనంగా కేటాయించిన సీట్లతో మరికొందరు విద్యార్థులు తమ వైద్య విద్య కలను సాకారం చేసుకునే అవకాశం లభించిందన్నారు సత్యకుమార్ యాదవ్.. కొత్తగా 100 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు కాగా.. NMC రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా 'లెటర్ ఆఫ్ పర్మిషన్' అందజేసింది. ఈ 100 సీట్లలో కడప ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అదనంగా 75 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. కడప మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 175 నుంచి ఒకేసారి 250కు పెరిగింది. నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అదనంగా కొత్తగా 25 సీట్లకు అనుమతి వచ్చింది. దీంతో నెల్లూరు కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 175 నుంచి 200కు చేరింది. మొత్తం మీద ఇటీవల 100 సీట్లు.. తాజాగా మరో 175 సీట్లు కలిపి 275 సీట్లకు పెరిగాయి.