నెల్లూరు జిల్లా . ఎవ్వరూ ఊహించని విధంగా సొంత బావ మరిదే హత్య చేయడం.. ఆ పై పోస్టు మార్టం లేకుండా పూడ్చాల్సిన మృతదేహాన్ని కాల్చేయడం చేశారు. ఈ కేసులో ఇన్ని అనుమానాస్పద కోణాలు ఉన్నప్పటికీ సంఘటనా స్థలంలోనే ఉన్న పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎస్పీ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఈ హత్య కేసు దర్యాప్తులో బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మొత్తం 23 మంది సిబ్బందీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో వారందర్నీ బదిలీ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అనిత వేజెండ్ల తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సీఐ మాతంగి శ్రీనివాసరావును కూడా వీఆర్‌కు పంపడం చోటుచేసుకుంది. ఇలా ఒక పోలీస్ స్టేషన్ మొత్తాన్నీ బదిలీ చేయడంతో ఈ వార్త సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే.. బుచ్చిరెడ్డిపాలెం వ్యవసాయాధికారికారిగా పనిచేస్తున్న శ్రీహరి తనకు సంబంధించిన కోటి రూపాయల ఆస్తిని తన సొంత బావమరిది అయిన హరికృష్ణ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. కొత్త ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో బావమరిది పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిన ఆస్తి, దాంతో పాటు అప్పుగా ఇచ్చిన కొంత మొత్తాన్ని ఇవ్వాలని కోరారు. అయితే, అవి తిరిగి ఇవ్వడం ఇష్టం లేని బావమరిది హరికృష్ణ బావను చంపాలని ప్లాన్ చేశాడు. పెంచలకోన దైవ దర్శనానికి వెళ్లొద్దామని బావని కారులో తీసుకెళ్లాడు. పెంచలకోన నుంచి తిరిగి వస్తున్న సమయంలో కారును మధ్యలో ఆపి.. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం అక్కడో ఇద్దర్ని పెట్టి ఏఓ శ్రీహరికి కుక్కులను చంపే ఇంజెక్షన్ ఎక్కించాడు. దాంతో శ్రీహరి అక్కడికక్కడే గుండెపోటుతో మృతిచెందాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా గుండెపోటు అన్న నాటకంతో కుటుంబ సభ్యులను కర్మకాండలకు సిద్ధం చేశాడు. ఒంటిపై గాయాలు ఉన్నాయని తోటి ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు పట్టించుకోలేదు. పైగా పూడ్చేయాల్సిన మృతదేహాన్ని కాల్చేశారు. దాంతో సాక్షాలేమీ మిగల్లేదు. కానీ.. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత బావ ఆస్తిలో తనకు రావాల్సింది ఉందంటూ హరికృష్ణ గొడవకు దిగడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. శ్రీహరి భార్య ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తీగ లాగితే ఈ హత్య డొంక మొత్తం కదిలింది. అయితే, తొలుత హత్య అని చెప్పినా ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయకపోవడం.. కేసును పక్కదోవ పట్టించారనే ఆరోపణలు రావడం, దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో బుచ్చిరెడ్డిపాలెం పోలీసు స్టేషన్‌లో సిబ్బంది మొత్తంపై ఎస్పీ చర్యలు తీసుకొని, మొత్తం 23 మంది సిబ్బందిని బదిలీ చేశారు.