ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన, నమ్మశక్యం కాని ఒక కాకతాళీయం ఇప్పుడు నిజం కాబోతోంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం ఒక స్వచ్ఛంద క్యాలెండర్ షూట్ కోసం దిగిన ఫొటో.. ఇప్పుడు 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ వేదికగా ఒక అద్భుతమైన వాస్తవంగా మారబోతోంది. 2007లో తీసిన ఆ ఫోటోలో 20 ఏళ్ల యువ లియోనెల్ మెస్సీ.. ఒక చిన్న ప్లాస్టిక్ టబ్‌లో పసికందుగా ఉన్న లామిన్ యమల్‌కు స్నానం చేయిస్తూ కనిస్తున్నాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే పసికందు లామిన్ , దిగ్గజ ఆటగాడు ఆదివారం జరగబోయే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఒకరినొకరు ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు.ఫిఫా ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్ జట్ల మధ్య న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో చారిత్రాత్మక టైటిల్ పోరు జరగనుంది. ఈ క్రేజీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు నాటి ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై లియోనెల్ మెస్సీ స్పందించాడు."ఆ ఫొటో అద్భుతంగా ఉంది. అతడు చిన్న పిల్లాడిలా ఉన్నప్పుడు నేను ఫొటో దిగా. ఇప్పుడు మేమిద్దరం వరల్డ్ కప్‌లో ఆడటం, అది కూడా ప్రత్యర్థులుగా బరిలోకి దిగనుండటంతో నమ్మశక్యం కాని విషయం. అయితే ప్రత్యర్థిగా మేం అతడిని అత్యుత్తమ ఆటతీరుకు అడ్డుగా నిలిచేందుకు ప్రయత్నిస్తాం. యమల్‌కు మంచి భవిష్యత్తు ఉంది. ప్రస్తుతం అతడికి 19 ఏళ్లే. ఆల్ ది బెస్ట్ యమల్. ఏది ఏమైనా ఈ ప్రపంచకప్‌లో అతడిని ఛాంపియన్ కానివ్వం" అని మెస్సీ వ్యాఖ్యానించాడు. ఇద్దరు ఆటగాళ్ల భవిష్యత్తు, చరిత్ర దాగి ఉన్నాయి. అర్జెంటీనాను వరుసగా రెండోసారి ప్రపంచకప్ విజేతగా నిలిపి, బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ అందించిన తొలి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాలని మెస్సీ భావిస్తున్నాడు. మరోవైపు యమల్ ప్రపంచకప్ ఫైనల్ ఆడి గెలిచిన రెండో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.