వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించిన సర్ (89) కన్నుమూశారు. ఈ విషయాన్ని సోబర్స్‌ కుమారుడు డానియల్‌ శుక్రవారం అధికారికంగా వెల్లడించాడు. 1954 నుంచి 1974 మధ్య కాలంలో వెస్టిండీస్ జట్టు తరఫున ఆడాడు సోబర్స్. మొత్తం 93 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించి 57.78 సగటుతో 8032 పరుగులు సాధించారు. కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ అద్భుతాలు చేస్తూ ప్రపంచ క్రికెట్‌ను దశాబ్దాల పాటు శాసించారు. తన కెరీర్‌లో 235 వికెట్లు పడగొట్టిన ఆయన, 109 క్యాచ్‌లు అందుకున్నారు.క్రికెట్‌ అందించిన గొప్ప ఆటగాళ్లలో సోబర్స్‌ ఒకరు. ఎడమచేతి వాటం బ్యాటింగ్‌లో దిట్ట అయిన ఆయన పేస్‌ బౌలింగ్‌లోనూ అంతే మేటి. అంతేకాదు స్పిన్‌ బౌలింగ్‌ చేయడంలో సోబర్స్‌ సిద్ధహస్తుడిగా పేరు సంపాదించారు. అంతేకాకుండా నాటి తరంలో గొప్ప ఫీల్డర్లలో ఒకరిగా నిలిచారు. ఆటలో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సోబర్స్‌ క్రికెట్‌ మేధావిగా గుర్తింపు పొందారు.17 సంవత్సరాల వయస్సులో వెస్టిండీస్‌ తరపున టెస్ట్‌ల్లో అరంగేట్రం చేశాడు సోబర్స్. బార్బడోస్‌లో జన్మించిన ఆయన ఎడమచేతి వాటం బౌలర్‌గా ఎన్నో వైవిధ్యమైన శైలులతో బౌలింగ్ చేసేవారు. ఒకే మ్యాచ్‌లో ఆర్థోడాక్స్ స్పిన్, రిస్ట్ స్పిన్ తో పాటు మీడియం పేస్ కూడా వేయగల అసాధారణ నైపుణ్యం ఆయన సొంతం. 1958 లో పాకిస్తాన్‌పై తన తొలి టెస్ట్ సెంచరీని ఏకంగా 365 పరుగుల భారీ అజేయ స్కోరుగా మార్చి అప్పట్లోనే ప్రపంచ రికార్డు సృష్టించారు. 1994 లో బ్రయాన్ లారా 375 పరుగులు చేసే వరకు ఈ రికార్డే అత్యధిక స్కోరుగా నిలిచింది. ఇప్పటికీ ఒక బ్యాటర్ చేసిన అత్యధిక తొలి టెస్ట్ సెంచరీ రికార్డు సోబర్స్ పేరిటే భద్రంగా ఉంది.అంతేకాకుండా సోబర్స్ 1968లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఏకంగా ఆరు సిక్సర్లు బాదారు. దీంతో ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించారు. క్రికెట్‌కు ఆయన చేసిన సేవలకు గానూ.. 1975లో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II చేతుల మీదుగా 'నైట్' బిరుదును అందుకున్నారు. ఇక ఆయన గౌరవార్ధం ఏటా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రికెటర్‌కు ఐసీసీ.. 'సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్' పేరిట అవార్డు సైతం అందజేస్తోంది.