తిరుమల తొలి హారతి వివాదం: డీకే శివకుమార్ వర్సెస్ టీటీడీ.. కర్ణాటకకే ఎందుకు ప్రాధాన్యం!

Wait 5 sec.

కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తిరుమల శ్రీవారి తొలి హారతిపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమవుతున్నాయి. కర్ణాటక ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు అవకాశం కల్పిస్తామంటూ డీకే శివకుమార్ చేసిన ఏకపక్ష ప్రకటనను తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్, బోర్డు సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఇప్పటికే ఈ విషయం మీద స్పందించగా.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ నాయుడు అభిప్రాయపడ్డారు. తిరుమల శ్రీవారి ఆలయ నిబంధనలను డీకే శివకుమార్‌కు పంపిస్తామని.. కావాలంటే చదువుకోవచ్చని అన్నారు. టీటీడీ నుంచి డీకే శివకుమార్‌కు రిజాండర్ పంపిస్తామని విలేకర్ల సమావేశంలో తెలిపారు. డీకే శివకుమార్ ఏమన్నారంటే..తిరుమల శ్రీవారి ఆలయంలో రోజూ నిర్వహించే తొలి హారతిని ప్రోటోకాల్ ప్రకారం.. కర్ణాటక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వీక్షించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. దీనిపై అధికారిక ప్రోటోకాల్ ఉత్తర్వులను త్వరలోనే జారీ చేస్తామని వెల్లడించారు. తిరుమలకు చెందిన అనేక మంది కర్ణాటక ప్రజాప్రతినిధులు సరైన దర్శనం లేకుండానే తిరిగొచ్చిన సందర్భాలు ఉన్నాయని.. ఇక మీదట ప్రోటోకాల్ ప్రకారం తిరుమల నిత్య హారతిలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి చేసిన ఏకపక్ష ప్రకటనపై టీటీడీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.కర్ణాటకకు ఎందుకంత ప్రాధాన్యం?తిరుమల శ్రీవారికి ప్రతి రోజూ తొలి గంట సమయంలో.. నైవేద్య సమయంలో నిత్య హారతులు సమర్పిస్తారు. 20 మఠాలు. మైసూరు సంస్థానం తరుఫున మొత్తం 21 నిత్య హారతులు సమర్పిస్తారు. మఠాలు, మైసూరు సంస్థాన ప్రతినిధులు హారతి పళ్లెంతో ఆలయంలోకి వెళ్తే.. అక్కడ ఉన్న అర్చకులు శ్రీవారికి ఆ హారతి సమర్పించి.. తిరిగి వారికే అందజేస్తారు. అయితే ఇందులో పాల్గొనేందుకు అందరికీ అనుమతి ఉండదు. మఠాల అధికారులు ప్రతి సంవత్సరం ముగ్గురి పేర్లతో కూడిన ప్రతినిధుల జాబితాను టీటీడీకి అందిస్తారు. ఆ జాబితాలోనే ప్రతినిధులే నిత్య హారతిలో పాల్గొనాల్సి ఉంటుంది. అలాగే మైసూరు సంస్థానం తరుఫున కర్ణాటక అధికారిక ప్రతినిధి తొలి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అంతేకానీ కర్ణాటకతో పాటు ఏ రాష్ట్ర నేతలకూ ఇందులో అవకాశం ఉండదు. మైసూరు సంస్థానానికి ప్రాధాన్యం ఎందుకంటే.. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు తిరుమల పుణ్యక్షేత్రం అభివృద్ధికి మైసూరు మహారాజు తోడ్పాటు అందించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఉపయోగించే వాహనాలతో పాటుగా ఏనుగు దంతాలు, కళాకృతులతో పల్లకీని ప్రత్యేకంగా తయారు చేయించారు. అలాగే 1945లో మైసూరు మహారాజు జయచామ రాజేంద్ర వడయార్.. విలువైన కెంపుల హారాన్ని శ్రీవారికి సమర్పించారు. మైసూరు మహారాజు గౌరవార్థం.. ఆ సంస్థానం తరుఫున కర్ణాటక ప్రతినిధికి శ్రీవారి ఆలయంలో తొలి హారతి అందిస్తారు. అలాగే మైసూరు మహారాజు జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా పల్లవోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఉత్తరాభద్ర నక్షత్రం రోజున ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ప్రతిరోజూ తెల్లవారుజామున సుప్రభాతసేవ కంటే ముందు మైసూరు సంస్థానం తరఫున నవనీత హారతి, ఆలయంలోని అఖండ దీపాలైన బ్రహ్మదీపాలకు నెయ్యి ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. ఉగాది ఆస్థానం, దీపావళి ఆస్థానం, ఆణివార ఆస్థానాలలోనూ మైసూరు మహారాజు పేరుతో ప్రత్యేక హారతి సమర్పిస్తారు. మైసూరు సంస్థానం తరుఫున కర్ణాటకకు నిత్య హారతిలో ప్రాతినిధ్యం ఉందే కానీ.. ఆ రాష్ట్రానికి చెందిన రాజకీయ నేతలు పాల్గొనేందుకు అవకాశాలు లేవని టీటీడీ చెప్తోంది.