తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధికి వేగం పెంచేలా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన సాగుతోంది. ఇందులో భాగంగానే కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్‌), హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే.. మన్ననూరు-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, మంచిర్యాల-హైదరాబాద్ జాతీయ రహదారి వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులపై రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తి అయిందని నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ వివరించారు. వెంటనే కేంద్ర కేబినెట్ ఆమోదం మంజూరు చేసి ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి కూడా వెంటనే అనుమతులు ఇచ్చి భూసేకరణ ప్రారంభించేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తర, దక్షిణ భాగాల పనులు ఒకేసారి ప్రారంభమైతే నిర్మాణం వేగంగా పూర్తి కావడంతో పాటు వ్యయం కూడా తగ్గుతుందని వివరించారు.ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి అవసరమైన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి గడ్కరీని కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మిస్తే హైదరాబాద్-విజయవాడ మధ్య దూరం సుమారు 100 కిలోమీటర్లు తగ్గుతుందని.. దీనివల్ల మరింత వేగంగా సరకు రవాణా జరుగుతుందని తెలిపారు. ఈ హైవే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు.మరోవైపు.. మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్‌కు అవసరమైన అటవీ శాఖ అనుమతులను కేంద్ర ప్రభుత్వం త్వరగా మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. నల్లమల అభయారణ్యం, శ్రీశైలం ఆలయం, జలాశయాల పరిధిలో ఈ ప్రాజెక్టు ఉండటంతో కేంద్రం సహకారం అవసరమని తెలిపారు. అదే సమయంలో రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా మంచిర్యాల నుంచి హైదరాబాద్ వరకు 6 లేన్ల నేషనల్ హైవేను మంజూరు చేయాలని.. ఈ ప్రాజెక్టు భూసేకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని తెలిపారు. ఈ హైవే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.