ఉద్యోగులకు బిగ్ న్యూస్.. PF వేతన పరిమితి రూ.25000లకు పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం!

Wait 5 sec.

EPFO Wage Ceiling: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌ అకౌంట్ ఉన్న ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతన పరిమితిని పెంచుతారంటూ గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తలకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. ఉద్యోగుల పీఎఫ్ కంట్రిబ్యూషన్ ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కన పెట్టేసింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ, పెన్షన్ లెక్కల్లో రాబోయే మార్పులు ప్రస్తుతానికి ఆగిపోయాయని చెప్పవచ్చు. ప్రస్తుతానికి టేక్ హోమ్ శాలరీపై పీఎఫ్ కంట్రిబ్యూషన్ ప్రభావంలో తేడా ఉండదని చెప్పవచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ రూ.15000లోపు ఉంటే కచ్చితగా ఈపీఎఫ్ఓ పరిధిలోకి వస్తారు. వారి జీతం నుంచి 12 శాతం, కంపెనీ యాజమాన్యం నుంచి 12 శాతం చొప్పున పీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రూ.15000 పరిమితిని రూ.25000లకు పెంచాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. చివరి సారిగా 2014లో ఈ పరిమితిని రూ.6,500 నుంచి రూ.15000లకు పెంచారు.ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఎలాంటి మార్పు చేయలేదు. పెంపునకు బ్రేక్ వేసేందుకు కారణాలేంటి? కేంద్ర ప్రభుత్వం ఏటా అదనంగా వేల కోట్ల రూపాయలను కేటాయించాల్సి వస్తుంది. ఇది కేంద్ర బడ్జెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పరిమితి పెంచితే యాజమాన్యాలు కూడా తమ వైపు నుంచి ఉద్యోగులకు ఎక్కువ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెంచాల్సి వస్తుంది. దీనివల్ల కంపెనీల నిర్వహణ వ్యయం పెరిగి వ్యాపారాలపై భారం పడుతుందని పరిశ్రమ వర్గాలు వాదిస్తున్నాయి. జీతం తక్కువగా ఉండే ఉద్యోగుల పీఎఫ్ వాటా పెరిగితే ప్రతి నెలా వారి చేతికి వచ్చే నికర జీతం తగ్గుతుంది. ఇది తక్షణ ఖర్చులకు ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా కారణాలను పరిశీలించిన క్రమంలోనే కేంద్రం ఈ మేరకు వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త లేబర్ కోడ్స్ అమలులోకి వచ్చిన క్రమంలో ఇప్పటికే కంపెనీలపై అదనపు ఖర్చుల భారం పెరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో పీఎఫ్ పరిమితి సైతం పెంచితే వ్యాపార సంస్థలపై మరింత ఆర్థిక ఒత్తిడి పెరుగుతుందని కేంద్రం భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఐటీ రంగంలోని సంస్థలు ఇప్పటికే కొత్త రూల్స్ కోసం వందల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని సూచించాయి. అందుకే అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులపై ప్రభావం ఎలా?పీఎఫ్ వేతన పరిమితి పెంపు వాయిదా పడడం వల్ల ఒక రకంగా ఉద్యోగులకు నష్టమేనని చెప్పాలి. ఎందుకంటే పరిమితి పెరిగితే భవిష్యత్తులో వచ్చే రిటైర్మెంట్ ఫండ్, నెలవారీ వచ్చే పెన్షన్ భారీగా పెరిగే అవకాశం ఉండేది. ప్రస్తుతానికి పాత విధానమే కొనసాగుతుంది. కనీసం రూ.1800 పీఎఫ్ కటింగ్ చేయనున్నారు. ఆపైన కట్ చేయాలంటే ఉద్యోగి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది.