తెలంగాణలో చేపడుతున్న భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తె వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం వేగంగా కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణ కాంప్రహెన్సివ్ ఏరియా డెవలప్‌మెంట్ ప్లానింగ్ బిల్లు-2026 ప్రాథమిక ముసాయిదాను అధికారులు సిద్ధం చేశారు. ఈ ముసాయిదా బిల్లుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో పురపాలక, రవాణా, రోడ్లు-భవనాలు, ఇరిగేషన్ తదితర శాఖల ఉన్నతాధికారులతో పాటు హెచ్‌ఎండీఏ అధికారులతో సమగ్రంగా చర్చించారు. ప్రస్తుతం బిల్లు ముసాయిదాకు తుది రూపు ఇచ్చేందుకు ముమ్మర చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న ల్యాండ్ పూలింగ్ విధానాలు మెరుగ్గా ఉన్నాయని గుర్తించిన అధికారులు, వాటిలోని ఉత్తమ పద్ధతులను కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో అమలు చేసేందుకు ప్రత్యేక ల్యాండ్ పూలింగ్ చట్టం లేకపోవడంతో కొత్త చట్టం ద్వారా భూసేకరణ సమస్యలకు ముగింపు పలకాలని ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, రీజినల్ రింగ్ రోడ్, ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్లు, విమానాశ్రయాల విస్తరణ, పారిశ్రామిక కారిడార్లు, టౌన్‌షిప్‌లు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్ద ఎత్తున భూమి అవసరమవుతోంది. అయితే భూసేకరణ సమయాల్లో రైతులు తమ భూములు కోల్పోతామనే ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భూయజమానులకు, ప్రభుత్వానికి సమన్యాయం జరిగేలా పారదర్శక విధానాన్ని తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. పూలింగ్ ద్వారా సేకరించిన భూమిని అభివృద్ధి చేసిన అనంతరం.. అందులో కొంత భాగాన్ని ప్లాట్ల రూపంలో తిరిగా భూయజమానులకు కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు చిన్నచిన్న భూసమస్యల వల్ల ఆలస్యం అవుతుండటంతో ఈసారి ఇరిగేషన్ శాఖను కూడా భాగస్వామ్యం చేశారు. గతంలో ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో హెచ్‌ఎండీఏ చేపట్టిన ల్యాండ్ పూలింగ్ మోడల్ విజయవంతమైంది. అక్కడ ల్యాండ్ పూలింగ్‌లో అనుభవమున్న హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారికి ఈ నూతన చట్ట రూపకల్పన బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. త్వరలోనే వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని నియమించి వారి సిఫార్సుల ఆధారంగా బిల్లుకు తుది రూపునివ్వనున్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. ఎవరికీ అన్యాయం జరగకుండా పరిహారం అందుతుందని అధికారులు చెబుతున్నారు.