: కుటుంబంలో కలిసి హోటల్‌కో లేదా ఏ రెస్టారెంట్‌కో వెళ్లి తిన్నప్పుడు మనకు బిల్లులో అసలు తిన్న ఫుడ్ కాస్ట్ సహా ఇతర జీఎస్టీ, సర్వీస్ ఛార్జ్ అని ఇంకేవో ఛార్జీలు విధిస్తుంటారు. దీనిని చాలా మంది తెలియక అది ప్రభుత్వం విధిస్తున్న పన్ను కావొచ్చనుకొని పెద్దగా ఆలోచించకుండా కట్టేస్తుంటారు. అయితే ఇది చాలా మంది చేసే తప్పు. సర్వీస్ ఛార్జ్ అనేది కస్టమర్ తన ఇష్టపూర్వకంగా హోటల్ యజమాన్యానికి ఇచ్చే టిప్ లాంటిదే తప్ప.. ఇది తప్పనిసరి ఏం కాదు. ఇక్కడ సర్వీస్ ఛార్జ్‌ను హోటల్ యజమానులు తప్పనిసరిగా వసూలు చేసేందుకు వీల్లేదు. ఈ మేరకు కేంద్రం కీలక ప్రకటన చేసింది. వినియోగదారుల హక్కుల్ని కాలరాస్తూ బిల్లులో ఆటోమేటిక్‌గా ఈ ఛార్జీల్ని విధిస్తున్న 41 రెస్టారెంట్లపై కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (CCPA) చర్యలు చేపట్టింది. ప్రముఖ కేఫ్ సంస్థ చాయోస్‌కు ఏకంగా రూ. 50 వేల ఫైన్ విధించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్వయంగా ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. చాయోస్, బార్బిక్యూ నేషన్, ఎల్ ఒపెరా ఫ్రెంచ్ బేకరీ ప్రైవేట్ లిమిటెడ్ సహా మొత్తం 41 రెస్టారెంట్లపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. సర్వీస్ ఛార్జ్ అనేది ఆప్షనల్ అని, ఇది కచ్చితం కాదని స్పష్టం చేశారు. రెస్టారెంట్లే స్వయంగా సర్వీస్ ఛార్జ్‌ను డిఫాల్ట్‌గా యాడ్ చేయొద్దని పేర్కొన్నారు. ఇంకా వినియోగదారులు 1915 నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు కంప్లైంట్ చేయొచ్చని తెలిపారు.Read Also: కస్టమర్ తెలుసుకోవాల్సిన హక్కులుఏ హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లులో సర్వీస్ ఛార్జిని ఆటోమేటిక్‌గా లేదా బైడిఫాల్ట్‌గా యాడ్ చేయొద్దు. సర్వీస్ ఛార్జిని పేరు మార్చి, వేరే ఏ పేరుతో అయినా కస్టమర్ అనుమతి లేకుండా వసూలు చేయొద్దు. ఐచ్ఛికం. సర్వీస్ నచ్చితేనే కస్టమర్ తన ఇష్టానుసారం ఇస్తే ఇవ్వొచ్చు లేకపోతే లేదు. మేం సర్వీస్ ఛార్జ్ కట్టం అని చెప్పిన కస్టమర్లకు హోటల్‌లోకి ఎంట్రీ ఇవ్వకపోవడం, లేదా ఆహారం వడ్డించబోమని తిరస్కరించడం నేరం.సర్వీస్ ఛార్జ్ మొత్తాన్ని అసలు ఫుడ్ బిల్లులో కలపకూడదు. అంతేకాదు దీనిపై మళ్లీ జీఎస్టీ లెక్కించడం చట్టవిరుద్ధం. NCH కు అందిన ఫిర్యాదుల ఆధారంగా సీసీపీఏ ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలపై చర్యలు తీసుకుంది. జరిమానాలు విధించడంతో పాటుగా కస్టమర్ దగ్గర వసూలు చేసిన సర్వీస్ ఛార్జిల్ని తిరిగి ఇచ్చేయాలని, బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ మార్చాలని ఆదేశించింది. బిల్లులో సర్వీస్ ఛార్జ్ వేస్తే దానిని తీసివేయమని అక్కడి మేనేజర్ లేదా క్యాషియర్‌ను నేరుగా కోరవచ్చు. రెస్టారెంట్ యాజమాన్యం బిల్లు మార్చేందుకు నిరాకరిస్తే, భయపడాల్సిన పని లేదు. 1915 కు కాల్ చేసి వెంటనే ఫిర్యాదు చేయొచ్చు. NCH అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా ఇన్‌వాయిస్ కాపీని అప్లోడ్ చేసి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయొచ్చు.