పట్టణ పేదలకు తీపి కబురు.. క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు నేడు శ్రీకారం, 10 అంతస్తుల టవర్లతో నిర్మాణం

Wait 5 sec.

హైదరాబాద్ నగరంలోని పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించి ఉన్న పరిధిలో అల్పాదాయ వర్గాల ప్రజల కోసం లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే బృహత్తర పథకానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను నేడు సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్‌లు ప్రారంభించనున్నారు. దరఖాస్తు విధానం, అర్హతలు, మార్గదర్శకాలతో కూడిన ప్రత్యేక బ్రోచర్‌ను కూడా విడుదల చేయనున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడత కింద గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి మిగిలిన 32 జిల్లాల పరిధిలో సుమారు 3.68 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా.. అందులో 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మరో 2.50 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి అదనంగా.. క్యూర్‌ పరిధిలోని పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా మరో లక్ష ఇళ్లను నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం అమలు కోసం క్యూర్‌ పరిధిలోని ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, మేడ్చల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, నాంపల్లి, పటాన్‌చెరు వంటి ప్రధాన ప్రాంతాలలో వందల కోట్ల విలువైన అనువైన ప్రభుత్వ స్థలాలను అధికారులు ఇప్పటికే గుర్తించారు.ఈ పథకం కింద నియోజకవర్గాల వారీగా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. తొలి విడతలో భాగంగా 26 నియోజకవర్గాలను ఎంపిక చేసి.. ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు విస్తీర్ణం కలిగిన విలువైన స్థలాలను సేకరించామని.. అక్కడ గరిష్టంగా 10 అంతస్తుల వరకు బహుళ అంతస్తుల సముదాయాలను నిర్మిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున... లబ్ధిదారులు తమ సొంత నియోజకవర్గం పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం.. ఇకపై పట్టణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి కలను కూడా నిజం చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.