వైఎస్ కుటుంబానికి కంచుకోట. 1978 నుంచి ఇక్కడ వైఎస్ కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. రాజశేఖర రెడ్డి ఆరుసార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలవగా.. 2011లో జరిగిన ఉపఎన్నికలో ఆయన సతీమణి విజయమ్మ గెలిచారు. ఇక్కడి నుంచి హ్యాట్రిక్ సాధించారు. రాజశేఖర రెడ్డి సోదరులైన పురుషోత్తం రెడ్డి, వివేకానంద రెడ్డి కూడా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా పని చేశారు. 1983 నుంచి ఇప్పటి వరకూ టీడీపీ పులివెందులలో ఒక్కసారి కూడా గెలవలేకపోయింది.అయితే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసలు పులివెందుల నుంచి వైఎస్ జగన్, ఆయన కుటుంబీకులు పోటీ చేసే పరిస్థితి లేకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. దీనికి వారు ఓ కారణాన్ని బలంగా చెబుతున్నారు. అదే నియోజకవర్గాల పునర్విభజన.2029 నాటికి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే.. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. అదే సమయంలో నియోజకవర్గాల స్వరూపం, రిజర్వేషన్లు మారతాయి. ఈ క్రమంలోనే పులివెందుల నియోజకవర్గంలోనూ మార్పులొస్తాయని.. ఇది ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారొచ్చని లేదంటే అసలు నియోజకవర్గమే లేకుండా పోవచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న పుంగనూరు నియోజకవర్గానికి కూడా ఇదే పరిస్థితి ఎదురు కావచ్చని చెబుతున్నారు.దీనికి 2008 డీలిమిటేషన్‌కు సంబంధించిన ఉదాహరణలు కూడా ప్రస్తావిస్తున్నారు. 2004 ఎన్నిల వరకు కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గం జనరల్ స్థానంగా ఉండేదని.. కానీ పునర్విభజన తర్వాత ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారిందని గుర్తు చేస్తున్నారు. ఆ డీలిమిటేషన్‌లో కావలి నియోజకవర్గం రిజర్వేషన్ మారలేదు. కానీ ఆ నియోజకవర్గం భౌగోళిక స్వరూపం మారింది. కావలి పరిధిలోని వింజమూరు, దత్తలూరు మండలాలను ఉదయగిరి నియోజకవర్గంలో చేర్చారు. అప్పటి అల్లూరు నియోజకవర్గంలోని అల్లూరు, దగదర్తి మండలాలను కావలిలో చేర్చారు. ఫలితంగా ఉదయగిరి నియోజకవర్గంలో మండలాల సంఖ్య 8కి పెరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసం కావలికి 10 కి.మీ.లో ఉండే జలదంకి మండలాన్ని (గతంలో అల్లూరు నియోజకవర్గంలో ఉండేది) తీసుకెళ్లి ఉదయగిరి నియోజకవర్గంలో కలిపారు. 2009కి ముందు చిత్తూరు పార్లమెంట్ జనరల్ స్థానంగా ఉండేది. డీలిమిటేషన్ తర్వాత అది ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది.2009 ఎన్నికలకు ముందు జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియలో టీడీపీకి బలంగా ఉన్న స్థానాల్లో చాలా మార్పులు జరిగాయని.. అధికార కాంగ్రెస్‌కు అనుకూలంగా పునర్విభజన ప్రక్రియ జరిగిందని.. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి కూడా డీలిమిటేషన్ ప్రక్రియను తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే నియోజకవర్గాల పునర్విభజన జరగడం అనేది పూర్తిగా పార్లమెంట్ చేతుల్లో ఉంది. 2026 ఏప్రిల్‌లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజార్టీ రాకపోవడంతో ఈ బిల్లు ఆమోదం పొందలేదు. జులై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసేందుకు ఎన్డీయే సర్కారు ప్రయత్నించే అవకాశం ఉంది.