రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను తిడుతున్నా పక్కనే సైలెంట్‌గా కూర్చున్న మల్లారెడ్డి.. బీఆర్ఎస్ చర్యలు తీసుకుంటుందా?

Wait 5 sec.

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో పార్టీకి కొంత దూరం మెయింటైన్ చేస్తున్న మల్లారెడ్డి.. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. అదే సమయంలో తన సోషల్ మీడియా అకౌంట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వడం లేదు. ఇక.. మల్లారెడ్డి తన కుటుంబంతో సహా త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు మల్లారెడ్డి హాజరు కావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే సభలో సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నా.. స్టేజీ మీద కూర్చున్న మల్లారెడ్డి మాత్రం సైలెంట్‌గా ఉండటం గులాబీ నేతలు, కార్యకర్తలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఘట్‌కేసర్‌లో అందెశ్రీ స్మృతి వనం భూమిపూజ కార్యక్రమానికి మల్లారెడ్డి హాజరుకావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అదే సమయంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన యువ సంగ్రామ సదస్సుకు మల్లారెడ్డి గైర్హాజరుకావడం.. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరుకావడం కూడా పార్టీ వర్గాల్లో అనేక అనుమానాలకు కారణమైంది. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు, మద్దతుదారులు.. మల్లారెడ్డి వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తుంటే కనీసం నిరసనగా ఆ వేదికను వీడి వెళ్లి ఉంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఒక సందేశం వెళ్లేది అంటూ పలువురు పోస్టులు చేస్తున్నారు.బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఈ అంశంపై స్పందించారు. మల్లారెడ్డి వ్యవహారం తనకూ ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతకుముందు వారు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేశారనే వార్తలు కూడా వినిపించాయి. ఇటీవల ఆయన కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయానికి వెళ్లడం కూడా ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.అయితే సీఎం రేవంత్ రెడ్డి సభకు మల్లారెడ్డి హాజరు కావడం ప్రోటోకాల్‌లో భాగమేనని కొందరు విశ్లేషిస్తున్నప్పటికీ.. కేసీఆర్‌పై విమర్శల సమయంలో ఆయన మౌనం రాజకీయంగా కొత్త సందేహాలకు తావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం మల్లారెడ్డి వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.