ఈటల-బండి కలిస్తే అధికారమా.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీలో భగ్గుమన్న విభేదాలు

Wait 5 sec.

తెలంగాణ బీజేపీ నుంచి దూరంగా ఉన్నా ఆ పార్టీ గురించి మాత్రం ఎప్పుడూ వ్యాఖ్యలు చేస్తూ.. గోషామహల్ ఎమ్మెల్యే వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా పార్టీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై స్పందించిన ఆయన.. కేవలం ఇద్దరు నేతలు కలిస్తే పార్టీ అధికారంలోకి వస్తుందా అంటూ బీజేపీ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు.ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సమక్షంలో ఎంపీ ఈటల రాజేందర్, కేంద్రమంత్రి బండి సంజయ్ మధ్య సమన్వయం కుదిరిన నేపథ్యంలో రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈటల, బండి సంజయ్ కలిసి పని చేయడం మంచి పరిణామమే అయినప్పటికీ.. అంత మాత్రాన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. పార్టీలో సీనియర్ నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తల పరిస్థితి ఏమిటో కూడా నాయకత్వం ఆలోచించాలని సూచించారు.త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేషన్ ఎన్నికలపై కూడా రాజాసింగ్ తనదైన శైలిలో స్పందించారు. 3 కార్పొరేషన్లలో మేయర్ పదవులు గెలుస్తామని నేతలు చెబుతున్నారని.. ముందు ఒక కార్పొరేషన్‌లో అయినా సగం కార్పొరేటర్ స్థానాలు గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలం ఎంత ఉందో వాస్తవంగా అంచనా వేసుకోవాలని.. అతివిశ్వాసంతో ప్రకటనలు చేయడం వల్ల కార్యకర్తల్లో అయోమయం పెరుగుతుందని వ్యాఖ్యానించారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పరిస్థితిపైనా రాజాసింగ్ స్పందించారు. అధ్యక్షుడి చేతులు కట్టేసి పని చేయమంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. పార్టీలో కొద్దిమంది నేతల వ్యక్తిగత ఈగోలు, అంతర్గత విభేదాలు పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నాయని.. ఈ విషయాన్ని ఢిల్లీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.బీజేపీ అధికారంలోకి రావాలంటే కేవలం అగ్రనేతల మధ్య రాజీ సరిపోదని.. బూత్ స్థాయి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న కేడర్‌ను పట్టించుకోకుండా ఒక్క వ్యక్తి చుట్టూ నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో మరోసారి అంతర్గత చర్చకు దారితీయగా.. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కమలం పార్టీలో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.