దేశవ్యాప్తంగా భర్తలపై జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలపై గురుగ్రామ్‌కు చెందిన ఏకం న్యాయ్ ఫౌండేషన్ విడుదల చేసిన తాజా నివేదిక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2026 తొలి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 554 మంది భర్తలు హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకున్నట్లు ఏకం న్యాయ్ ఫౌండేషన్ సంస్థ వెల్లడించింది. అయితే ఇవి ప్రభుత్వ అధికారిక గణాంకాలు కాదని.. మీడియా కథనాలు, ఫౌండేషన్ సేకరించిన వివరాల ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటేషన్ రిపోర్టు మాత్రమేనని స్పష్టం చేసింది.ఈ నివేదిక ప్రకారం.. మొత్తం 322 మంది భర్తలు హత్యకు గురయ్యారని తెలుస్తోంది. వీరిలో అత్యధిక కేసులు భార్యలు లేదా వారి వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగిన కుట్రలతో ముడిపడి ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. మొత్తం హత్యల్లో 194 కేసులు (సుమారు 60.2 శాతం) వివాహేతర సంబంధాల కారణంగానే జరిగినట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. భార్యలు, తమ ప్రియులతో కలిసి కట్టుకున్న భర్తలను హత్య చేసిన ఘటనలు ఎక్కువగా నమోదు అయ్యాయని ఆ నివేదిక తెలిపింది.అదే సమయంలో 232 మంది భర్తలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఏకం న్యాయ్ ఫౌండేషన్ పేర్కొంది. వీటిలో కుటుంబ కలహాలు, గృహహింస, మానసిక వేధింపులు, తప్పుడు క్రిమినల్ కేసులు, పిల్లలను కలవనివ్వకపోవడం వంటి కారణాలు ప్రధానంగా ఉన్నాయని నివేదికలో వివరించింది. ఈ కేసుల్లో విషం పెట్టి చంపడం, గొంతు నులిమి హత్య చేయడం, విద్యుత్ షాక్ పెట్టి హతమార్చడం, సజీవదహనం చేయడం, మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరకడం, చంపేసి ప్రమాదంగా లేదా ఆత్మహత్యగా చిత్రీకరించడం వంటి అత్యంత దారుణమైన నేరాలు నమోదు అయినట్లు ఆ నివేదిక తెలిపింది.రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా 93 హత్యలు, 103 ఆత్మహత్యలతో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచినట్లు తెలిపింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయని పేర్కొంది.అయితే.. ఈ నివేదికపై ప్రభుత్వ అధికారిక ధృవీకరణ లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. దేశంలో భర్తల హత్యలు లేదా పురుషులపై గృహహింసకు సంబంధించిన ప్రత్యేక జాతీయ డేటాబేస్ లేకపోవడంతో అసలు సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏకం న్యాయ్ ఫౌండేషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సమస్య తీవ్రతను అంచనా వేయాలంటే అధికారిక గణాంకాల సేకరణ అవసరమని ఏకం న్యాయ్ ఫౌండేషన్ సంస్థ సూచించింది.