తెలంగాణలో షాబాద్ పోక్సో కేసు, ఆరు హత్య కేసులు, నిందితుడి ఆత్మహత్య వంటి సంచలనం రేపిన ఘటనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కీలక లేఖ రాశారు. పిల్లలపై లైంగిక నేరాల నివారణకు రూపొందించిన పోక్సో (POCSO) చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని కోరుతూ పలు కీలక సూచనలు చేశారు. ప్రతీ చిన్నారికి భద్రత, గౌరవం, న్యాయం అందించడం ప్రభుత్వాల రాజ్యాంగబద్ధ బాధ్యత అని లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా పూర్తి కావాలని.. బాధితులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని.. సాక్ష్యాలను శాస్త్రీయంగా భద్రపరచాలని పవన్ కళ్యాణ్ సూచించారు. సుప్రీంకోర్టు కూడా పోక్సో కేసులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పలు సందర్భాల్లో స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జనసేనాని గుర్తుచేశారు. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్‌లో 2023లో నమోదైన ఒక పోక్సో కేసును లేఖలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇప్పటికీ ఆధ్యాత్మిక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని.. ప్రజల విశ్వాసం ఉన్న సంస్థల్లో చట్టపరమైన చర్యలు పూర్తయ్యే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.అదే సమయంలో ఇటీవల రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన ఆరుగురు హత్యల ఘటనను కూడా పవన్ కళ్యాణ్ ఉదాహరణగా ప్రస్తావించారు. పోక్సో కేసుల్లో నిందితుల బెయిల్, బాధితుల భద్రత, బెదిరింపుల నివారణ వంటి అంశాల్లో మరింత కఠినమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. బాధితుల రక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఉండాలని సూచించారు.దర్యాప్తు అధికారులకు చిన్నారులతో వ్యవహరించే ప్రత్యేక శిక్షణ ఇవ్వడం.. 24 గంటల్లో బాధితులకు వైద్య పరీక్షలు పూర్తి చేయడం.. డీఎన్‌ఏ, ఫోరెన్సిక్ సాక్ష్యాలను వేగంగా సేకరించడం, నిర్ణీత గడువులో చార్జిషీట్‌ దాఖలు చేయడం వంటి సూచనలను లేఖలో పవన్ కళ్యాణ్ పొందుపరిచారు. ప్రతి జిల్లాలో పోక్సో కేసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. అదేవిధంగా.. బాధితులపై బెదిరింపులకు పాల్పడే వారు లేదా నేరచరిత్ర ఉన్న నిందితులపై రౌడీషీట్లు తెరవాలని.. పాఠశాలలు, హాస్టళ్లు, ప్రార్థనా మందిరాలు వంటి సంస్థల్లో పిల్లల భద్రత కోసం స్పష్టమైన ప్రోటోకాల్స్ అమలు చేయాలని కోరారు. ఈ సూచనలపై 30 రోజుల్లో కార్యాచరణ నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ లేఖ ద్వారా అభ్యర్థించారు.