గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ఎక్కువగా ఫోన్ మాట్లాడుతోందనే కారణంగా అనుమానం పెంచుకున్న ఓ భర్త.. ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తెనాలిలో నివసించే నరేంద్ర బాబు అనే వ్యక్తికి.. పల్నాడు జిల్లాలోని నూజెండ్లకు చెందిన సంధ్యారాణితో పది సంవత్సరాల కిందట పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. ప్రస్తుతం వీరంతా మండలంలోని అంగలకుదురులో నివసిస్తున్నారు. నరేంద్రబాబు బతుకుదెరువు కోసం తెనాలి చెంచుపేటలోని ఓ లిక్కర్ షాప్ వద్ద పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు.అయితే మద్యానికి అలవాటుపడిన నరేంద్రబాబు.. సంపాదన మొత్తం తాగుడుకే తగలేసేవాడు. ఇంటి నిర్వహణకు డబ్బులు ఇవ్వకపోవటంతో సంధ్యారాణి, నరేంద్రబాబు మధ్య తరుచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో ఆమె పిల్లలతో కలిసి పలుసార్లు పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత తిరిగి నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చేవాడు నరేంద్రబాబు. ఈ మధ్యకాలంలోనూ ఓసారి గొడవ జరగ్గా.. సంధ్యారాణి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే పెద్దమనుషుల సమక్షంలో రాజీ కుదుర్చుకుని నరేంద్రబాబు మళ్లీ సంధ్యారాణిని తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే ఈ మధ్యకాలంలో సంధ్యారాణి ఎక్కువగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఉండటంపై నరేంద్రబాబులో అనుమానం పెరిగింది. ఈ అనుమానమే పెనుభూతంగా మారి.. ఆమెను చంపేయాలనే నిర్ణయానికి వచ్చాడు నరేంద్రబాబు. ఆ తర్వాత పెద్ద కత్తిని కొనుగోలు చేసి ఇంట్లో దాచుకున్నాడు. జూలై పదో తేదీ ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి చేరుకున్నాడు నరేంద్ర బాబు. దీంతో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఆవేశానికి గురైన సంధ్యారాణి.. పుట్టింటికి వెళ్లిపోతా, ఇక రాను అంటూ హెచ్చరించింది. దీంతో కోపోద్రేకంలో నరేంద్రబాబు.. కత్తిని తీసుకున ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. భర్త దాడిలో సంధ్యారాణి ప్రాణాలు కోల్పోయింది. అనంతరం భయపడిపోయిన నరేంద్రబాబు పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. భార్యపై దాడి చేసే క్రమంలో నరేంద్రబాబుకు కూడా గాయాలు కావటంతో పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స చేయించిన అనంతరం నరేంద్రబాబును అరెస్ట్ చేసినట్లు తెనాలి పోలీసులు వెల్లడించారు. మరోవైపు హత్య జరిగిన జులై పదో తేదీ ఉదయం సంధ్యారాణి తన తల్లిదండ్రులతో వీడియో కాలా మాట్లాడారు. నరేంద్రబాబు వేధిస్తున్నాడని.. ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉందని తల్లిదండ్రుల ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది. ఆరోజే ఆమె ఊహించిన విధంగా భర్త చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది.