అమెరికాలో భారతీయుడిపై మతం పేరుతో దుండుగుడు దాడికి తెగబడ్డాడు. ‘నువ్వు ముస్లింవా’’ అని అడుగుతూ షాపింగ్ మాల్‌లోనే కత్తితో 15సార్లు పొడిచాడు. ఈ ఘటన యూటాలోని ఒక షాపింగ్ మాల్‌లో సోమవారం చోటుచేసుకుంది. కియోస్క్ నగల దుకాణంలో పనిచేస్తోన్న భారతీయుడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కోర్టు పత్రాల ప్రకారం.. ముస్లిం అయినందుకే తాను ఉద్దేశపూర్వకంగా అతడ్ని లక్ష్యంగా చేసుకున్నానని, ‘ముస్లింలను చంపాలనే ఉద్దేశం తనకు ఉందని’ దర్యాప్తు అధికారులకు నిందితుడు పీటర్ మైఖేల్ లార్సెన్ (48) చెప్పాడు.ఈ సంఘటన సోమవారం వెస్ట్ వ్యాలీ సిటీలోని వ్యాలీ ఫెయిర్ మాల్ లోపల జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భారతీయుడి దగ్గరకు వెళ్లి సంభాషణ ప్రారంభించిన మైఖేల్.. దాడికి పాల్పడటానికి ముందు అతడి మతం గురించి అడిగాడు. లార్సెన్‌పై హత్యాయత్నం, నిషేధిత ప్రమాదకర ఆయుధ ప్రవర్తన కింద అధికారులు అభియోగాలు మోపారు. అతడిని సాల్ట్ లేక్ కౌంటీ జైలులో ఉంచారు.సమీపంలోని ఒక నగల దుకాణంలో పనిచేసే లూనా నునెజ్, లార్సెన్ మొదట సోహైల్‌ను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగారు. ‘‘అతడు (లార్సెన్) నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అని అడిగితే.. ‘నేను భారతదేశం నుంచి వచ్చాను, నా పేరు సోహైల్’ అని చెప్పాడు. లార్సెన్ ‘మీరు ముస్లింలా?’ అని అంటే.. సోహైల్ అవునని అన్నాడు.. వెంటనే అతడిపై కత్తితో పొడవడం మొదలుపెట్టాడు’’ అనిఉటా ఇస్లామిక్ సెంటర్ ఇమామ్ షైబి దిన్ మాట్లాడుతూ.. సోహైల్‌ను లారెన్స్ వాటర్ బాటిల్ కూడా అడిగాడని చెప్పారు. అతడు తీసుకురావడానికి వెనక్కి తిరగగానే, నిందితుడు కత్తి తీసి దాడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. గోఫండ్‌మీ క్యాంపెయిన్ ప్రకారం.. సోహైల్‌ను 15 సార్లు కత్తితో పొడిచారు. అతడికి పలు శస్త్రచికిత్సలు జరిగాయని, పరిస్థితి విషమంగా ఉంది తెలిపింది. ఘటనాస్థలికి పోలీసులు చేరుకునేలోపే అక్కడున్న పలువురు లార్సెన్‌ను పట్టుకుని, కిందపడేసి దాడిని నిలువరించారు.లార్సెన్ హింసాత్మక చర్యలు... భావజాలాలు, ముందుగా ప్రణాళిక వేసుకున్న భారీ ప్రాణనష్టం కలిగించే సంఘటనల కారణంగా అతడు సమాజానికి తీవ్రమైన ముప్పు అని దర్యాప్తు అధికారులు తెలిపారు. లారెన్స్‌ను అడ్డుకుని, అదుపులోకి తీసుకునే క్రమంలో అతడికి గాయాలయ్యాయి.సోహైల్‌పై దాడిని ఆయన స్నేహితులు, సహోద్యోగులు ఖండించారు. అతడు చాలా కష్టపడే స్వభావం గల వ్యక్తి అని అభివర్ణించారు. ‘‘అతడికి ఎటువంటి బీమా లేదని నాకు తెలుసు. ఆ కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి అతడే. భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారెవరూ ఉద్యోగాలు చేయడం లేదు’’ అని స్నేహితుడు నూనెజ్ తెలిపారు.కియోస్కో షోరూమ్ మేనేజర్ అద్నాన్ మహ్మద్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. సమాజంలో ద్వేషానికి అస్సలు చోటు లేదని, సోహైల్ ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, చాలా కష్టపడి పనిచేసేవాడని అన్నారు. తాను అక్కడ ఉండి ఉంటే అతడ్ని ఎలాగైనా కాపాడుకునేవాడిని, నా ప్రాణాలనైనా అర్పించేవాడ్ని అని కన్నీరు పెట్టుకున్నారు. కాగా, దాడికి ముందు నిందితుడు లార్సెన్ మాల్‌లో తిరుగుతూ అక్కడి ప్రజల మతం గురించి ఆరా తీశాడని ఇతర ఉద్యోగులు తనకు చెప్పినట్లు నూనెజ్ వెల్లడించారు.అమెరికాలో ముస్లిం వ్యతిరేక సంఘటనలు విపరీతంగా పెరుగుతున్నాయని పౌర హక్కుల సంఘాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. వలసదారులకు వ్యతిరేకంగా మాట్లాడటం, జాత్యహంకార కార్యకలాపాలు పెరగడం, గాజాలో ఉద్రిక్తతల వంటి కారణాల వల్లే ఇటువంటి విద్వేష పూరిత దాడులు పెరుగుతున్నాయని చెబుతున్నారు.