హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. 20 రోజుల పాటు ఆ అండర్‌పాస్ బంద్, ప్రత్యామ్నాయ మార్గాలివే!

Wait 5 sec.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించేందుకు అధికారులు అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ అభివృద్ధి పనుల కారణంగా.. కొన్నిసార్లు ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, స్కైవేల నిర్మాణంతో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు రోడ్లను బంద్ చేస్తున్నారు. ఫలితంగా వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అయితే వాటికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా సైబరాబాద్ పరిధిలోని వైశాలీనగర్ రైల్వే అండర్‌పాస్‌ను జూలై 16వ తేదీ నుంచి 20 రోజుల పాటు పూర్తిగా మూసివేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. వైశాలీనగర్ రైల్వే అండర్‌పాస్‌ను పూర్తిగా మూసివేసి.. స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో ఈ వైశాలీనగర్ అండర్‌పాస్‌లో నీరు భారీగా నిలిచిపోవడం.. దీంతో వాహనాలన్నీ ఆగిపోయి ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ పనుల ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు.ఈ పనులు పూర్తయ్యే వరకు అండర్‌పాస్ మీదుగా ఎలాంటి వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సన్‌ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. దీంతో వాహనదారుల కోసం పలు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు. హఫీజ్‌పేట్ వైపు వెళ్లేవారికి.. మై హోమ్ మంగళా, తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ వైపు నుంచి వచ్చే వాహనాలు మై హోమ్ మంగళా టీ జంక్షన్ వద్ద యూ టర్న్ తీసుకుని రాఘవేంద్ర నగర్ కాలనీ, హైటెన్షన్ రోడ్, కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం మీదుగా హఫీజ్‌పేట్ ఆర్ఓబీ ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.మై హోమ్ మంగళా వెళ్లేవారికి.. హఫీజ్‌పేట్, ఆర్టీసీ కాలనీ, మై హోమ్ జువెల్, వాసవి లేక్ సిటీ, హఫీజ్‌పేట్ లేక్, గోపాల్‌నగర్, కాల్వరీ టెంపుల్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు పైప్‌లైన్ రోడ్ లేదా హఫీజ్‌పేట్ ఆర్ఓబీ మీదుగా జెన్‌పాక్ట్ జంక్షన్ చేరుకుని, అక్కడి నుంచి కొండాపూర్ ఆల్విన్ రోడ్ ద్వారా మై హోమ్ మంగళా, రాఘవేంద్ర నగర్ వైపు వెళ్లాలని పేర్కొన్నారు.ముందుగానే వాహనదారులు తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకుని.. ట్రాఫిక్ మళ్లింపులను పాటించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనుల వల్ల తాత్కాలిక అసౌకర్యం కలిగినప్పటికీ.. భవిష్యత్తులో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు వర్షాకాలంలో నీరు నిలిచిపోయే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. వాహనదారులు ఈ ట్రాఫిక్ మళ్లింపులను గుర్తుంచుకోవాలని తెలిపారు.