SGB Redemption: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టిన వారికి బంగారం లాంచి లాభాలు వచ్చాయి. ఒక నిర్దిష్ట పాత సిరీస్ ఎస్‌జీబీ ప్రీమెచ్యూర్ విత్ డ్రాయల్ సమయం ఆసన్నమైంది. దీంతో ఆర్‌బీఐ తాజా రిడెంపషన్ ధరను అధికారికంగా విడుదల చేసింది. సావెరిన్ గోల్డ్ బాండ్ 2021-22 సిరీస్ -4 బాండ్లు జారీ చేసి ఐదేళ్లు పూర్తయిన క్రమంలో ముందస్తు విక్రయం కోసం కొత్త ధరలను ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే ఈ బాండ్లు కొన్నవారికి 198 శాతం లాభం వస్తుంది. అంటే దాదాపు మూడింతల లాభం వచ్చినట్లయింది. దీనికి అదనంగా ప్రతి సంవత్సరం 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. జులై 20, 2021 రోజున జారీ చేసిన సావెరిన్ గోల్డ్ బాండ్ 2021-22 సిరీస్-IV ప్రీమెచ్యూర్ రిడంప్షన్ తేదీని జులై 20, 2026గా రిజర్వ్ బ్యాంక్ ఖరారు చేసింది. ఈ బాండ్లు జారీ చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో ముందస్తు విక్రయం కోసం అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. సాధారణంగా సావెరిన్ గోల్డ్ బాండ్ల కాల వ్యవధి 8 సంవత్సరాలు ఉంటుంది. అయితే, 5 సంవత్సరాల లాకిన్ పీరియడ్ తర్వాత ముందస్తు విత్ డ్రాయల్‌కి అవకాశం కల్పిస్తారు. గ్రాముపై రూ.9401 లాభంప్రీమెచ్యూర్ కోసం బంగారం ధరలను జులై 15, జులై 16, జులై 17, 2026 తేదీల్లోని బంగారం ధరల సగటు ఆధారంగా 1 గ్రాముకు రూ.14,158గా నిర్ణయించారు. ఎస్‌జీబీ 2021-22 సిరీస్ 4 బాండ్లను కొనుగోలు చేసినప్పుడు ఆన్‌లైన్ లో 1 గ్రాముకు రూ.4,757కు అందించారు. అంటే దీని ప్రకారం 197.60 శాతం లాభం వచ్చినట్లవుతుంది. అంటే లక్ష రూపాయలు పెట్టినట్లయితే అది రూ.2.98 లక్షల వరకు అవుతుంది. ట్యాక్స్ పడుతుందా?సావెరిన్ గోల్డ్ బాండ్లను పూర్తిగా 8 సంవత్సరాల మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే దాని ద్వారా వచ్చే క్యాపిటల్ గెయిన్స్ పైన ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అయితే, ముందస్తు విక్రయాలపై నిబంధనల ప్రకారం ట్యాక్స్ వర్తిస్తుంది. ఫిజికల్ గోల్డ్ తో పోలిస్తే డిజిటల్ లేదా పేపర్ రూపంలో ఉండే సావరిన్ గోల్డ్ బాండ్లు సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి ఆప్షన్ అని ఈ భారీ రిటర్న్స్ నిరూపించాయి. మీ వద్ద పాత గోల్డ్ బాండ్లు ఉంటే ఆర్‌బీఐ నోటిఫికేషన్ ప్రకారం వాటి రిడెంప్షన్ తేదీలను ఒకసారి చెక్ చేసుకోండి.