అటవీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అటవీ భూములను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉండటంతో అవి అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు అధికారులు కూడా అదే స్థాయిలో పనిచేస్తుంటారు. అయితే, కొందరు అటవీ శాఖ భూముల్లో బోర్లు వేసి వాటిని ఆక్రమించే ప్రయత్నం చేయగా.. విషయం తెలుసుకున్న అధికారులు వాటిని పూడ్చేందుకు వెళ్లారు. అది తెలుసుకున్న తండా వాసులు బైక్‌లపై గ్యాంగ్‌ల వచ్చి అటవీశాఖ అధికారులపైనే దాడికి దిగారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా మాచర్లలో చోటుచేసుకుంది. అటవీశాఖ రేంజర్ విజయలక్ష్మి కథనం మేరకు.. మారచర్ల మండలం కండ్లకుంట బీట్ పరిధిలోని రేగులవరం తండాకు చెందిన కొందరు అటవీ భూమిలో బోరు వేసి, పంటలు పండిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు రావడంతో మూడు వాహనాల్లో రేంజర్ విజయలక్ష్మితో పాటు 12 మంది సిబ్బంది తండాకు వెళ్లారు. రవి నాయక్ అనే వ్యక్తి అనుమతులు లేకుండా బోరు తవ్వినట్లు గుర్తించి, అధికారులు పూడ్చేశారు. READ ALSO అయితే, ఆ ప్రదేశంలో ఇంకా బోర్లు వేశారన్న సమాచారంతో మరో చోట పరిశీలించేందుక అధికారులు బయల్దేరారు. అదే సమయంలో తండాకు చెందిన కొందరు బైకులపై వచ్చి అటవీశాఖ సిబ్బంది వాహనాలను అడ్డుకున్నారు. టైర్లలోని గాలి తీసి వాగ్వాదానికి దిగారు. అడ్డుకున్న సిబ్బందిపై కొందరు దాడికి కూడా పాల్పడ్డారు. ఏకంగా మూడు గంటల పాటు వారిని అక్కడ నుంచి కదలనివ్వని పరిస్థితి. తమపై దాడి చేసి, తమను అడ్డుకున్నారంటూ అటవీ శాఖ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో విజయపురి సౌత్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి, తండా వాసులను చెదరగొట్టి అటవీ శాఖ సిబ్బందిని క్షేమంగా తీసుకొచ్చారు. అయితే, తాము సాగు చేసుకుంటున్న భూములను అటవీ శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకుంటున్నారు అంటూ తండావాసులు ఆందోళనకు దిగారు. మాచర్లలోని అటవీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణ ఏర్పడింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి తండా వాసులకు సర్ది చెప్పి అక్కడ నుంచి పంపించారు.