బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ 2009 నాటి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్టునిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డు 2026 ప్రదానోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్.. పులివెందులకు చెందిన ఖైదీ తనకు షేవింగ్ చేసిన ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన చెప్పిన మాటలు యథాతథంగా..‘‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో.. అంటూ . ఆ రోజు ముందుగా అనుకున్న ప్రకారం కేసీఆర్ కరీంనగర్ నుంచి బయల్దేరి సిద్ధిపేట వెళ్లి అక్కడ దీక్ష చేపట్టాలి. కానీ అలగనూరు వచ్చే సరికే కేసీఆర్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మానేరు వాగు అవతల మమ్మల్ని ఆపారు. మేం పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చే సరికే కేసీఆర్‌ను తీసుకెళ్లిపోయారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను అక్కడ వదిలేశారు. ఆయన్ను నా కార్లో ఎక్కించుకొని పోలీసు వాహనాలను అనుసరిస్తూ వెళ్లాం.వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి చేరుకునే సరికి అక్కడ రాస్తారోకో జరుగుతోంది. నేను అక్కడ విద్యార్థులతో ధర్నాకు కూర్చొని.. జయశంకర్ సార్‌ను ఇంటికి పంపించాను. తర్వాత పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి వ్యాన్‌లో తీసుకెళ్తున్నారు. హనుమకొండ చౌరస్తా వద్ద వ్యాన్ ఆగితే మేం కిందకు దూకి జయశంకర్ సార్ ఇంట్లోకి వెళ్లి కూర్చొన్నాం. పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకుని పారిపోయినందుకు మళ్లీ అరెస్టు చేస్తున్నామని చెప్పి అరెస్ట్ చేశారు.తర్వాత కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి జైలుకు తరలించారు. నవంబర్ 29వ తేదీ రాత్రంతా జైల్లో గడిపాను. జైలర్, సిబ్బంది నన్ను బాగా చూసుకున్నారు. సెల్‌లో ఎందుకు హాస్పిటల్‌లో పడుకోండని జైలర్ చెప్పారు. చాయ్ తాగుతారా, గడ్డం చేయించుకుంటరా అని అడిగారు. సరే అని చెప్పాను.బయటకు తీసుకెళ్లి చెట్టు కింద కూర్చోబెట్టి ఓ బార్బర్‌ను పిలిచి షేవింగ్ చేయమని చెప్పారు. గడ్డం చేసేటప్పుడు మాటలు కలపడం కోసం ఏ ఊరు తమ్ముడూ అని బార్బర్‌ను అడిగాను. అప్పటికీ కత్తి సరిగ్గా నా పీక మీద ఉంది. అతడు పులివెందుల సార్ అన్నాడు. ఇగ ముచ్చట బంద్ ఆడికి. రాజశేఖర రెడ్డి చనిపోయి అప్పటికి నాలుగు నెలలే అయ్యింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రం కావాలని మనమేమో ఆగమాగం చేస్తున్నాం. ఆ సోదరుడిది పులివెందుల, ఏదో మర్డర్ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్నాడు. అప్పటికే కత్తి పీక మీద ఉంది. ఇంకేం మాట్లాడతామని మాట్లాడలేదు. తర్వాత ఆ సోదరుడు నవ్విండు. నాకు రాజశేఖర రెడ్డి అంటే ఇష్టం, కేసీఆర్ అన్నా ఇష్టమే. కొట్లాడేటోళ్లంటే నాకు ఇష్టమని చెప్పిండు’’ అని కేటీఆర్ 2009 నాటి సరదా అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.రాజకీయాల్లో పడి రోజూ ఓ మూసలో తాము కొట్టుకొని పోతామని.. అప్పుడప్పుడు కళాకారులు, కవులు, చిత్రకారులతో మమేకం కావడానికి, వారితో మాట్లాడటానికి సందర్భాలు వెతుక్కుంటామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో పని చేసిన ప్రముఖ కార్టునిస్ట్ ఆర్కే లక్ష్మణ్‌ సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఇప్పటి కార్టునిస్టులంతా ఆయనకు ఏకలవ్య శిష్యులేనన్నారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలు నేడు భారత దేశానికి ఎంతో అవసరమన్నారు. రాజకీయాలు, జీవితంలో గెలుపోటములు సహజమేనన్న కేటీఆర్.. మనం ఉన్నంత కాలం ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలన్నారు.