: మీరు పెట్టుబడులు చేసేందుకు ఎలాంటి సాధనాల్ని ఎంచుకుంటారు. చాలా మందికి చాలానే ఆప్షన్లు ఉంటాయి. వీటిల్లో స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా చాలానే ఉంటాయి. అయితే కొన్ని రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ అందించే స్కీమ్స్, పెట్టుబడి సాధనాలు ఉంటాయి. వీటిల్లో బ్యాంక్ ఎఫ్‌డీలు సహా పోస్టాఫీస్ పథకాల గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. అయితే ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లు కూడా ఇక్కడ బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ హామీతో కచ్చితమైన రిటర్న్స్ అందుకోవచ్చు. ఎలాంటి రిస్కూ ఉండదు. చాలా వరకు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో కంటే అధిక వడ్డీనే వస్తుంది. ఈ స్కీమ్ పూర్తి వివరాల్ని చూద్దాం. అయితే ఈ ఆర్బీఐ సేవింగ్స్ బాండ్ల వడ్డీ రేట్లు ఒక పోస్టాఫీస్ స్కీమ్ వడ్డీ రేట్లపైనే ఆధారపడి ఉంటుంది. అవును ఇది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) వడ్డీ రేట్లతో లింక్ అయి ఉంటుంది. ఎన్ఎస్‌సీ వడ్డీ రేటు కంటే 0.35 శాతం లేదా 35 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీ వస్తుంది. ప్రస్తుతం జులై- సెప్టెంబర్ త్రైమాసికానికిగానూ NSC వడ్డీ రేటు 7.7 శాతంగా ఉండగా, ఈ ఆర్బీఐ సేవింగ్స్ బాండ్ల వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంది. ఎన్ఎస్‌సీ వడ్డీ రేటు మారితే దానికి అనుగుణంగానే ఆర్బీఐ బాండ్ల వడ్డీ రేట్లు మారుతుంటాయి. కానీ చాలా కాలంగా పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు మారట్లేదు కాబట్టి ఈ ఆర్బీఐ బాండ్ల వడ్డీ రేటు కూడా యథాతథంగా కొనసాగుతూ వస్తున్నాయి. Read Also: ఈ స్కీమ్ విషయానికి వస్తే ఏడేళ్ల కాల పరిమితితో వస్తుంది. ఇందులో కనీసం రూ. 1000 పెట్టుబడితో చేరేందుకు వీలుంటుంది. గరిష్ఠ పెట్టుబడి పరిమితి లేదు. సాధారణ ఇన్వెస్టర్లకు ఏడేళ్ల లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. అంటే ముందుగా డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు వీల్లేదు. అదే సీనియర్ సిటిజెన్లకు మాత్రం ఐదేళ్లు దాటిన తర్వాత ముందస్తు ఉపసంహరణకు అవకాశం కల్పిస్తోంది. భారతీయ నివాసితులు ఎవరైనా ఇందులో చేరేందుకు ఛాన్స్ ఉంటుంది. ఆర్బీఐ బాండ్ల వడ్డీ రేటు 8.05 శాతంగా ఉండగా, ఐదేళ్ల వ్యవధికి చాలా ప్రముఖ బ్యాంకుల్లో ఇంత కంటే వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంది. ఐదేళ్ల డిపాజిట్ వడ్డీ రేట్లను ప్రముఖ బ్యాంకుల్లో చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంకులో 6.35 శాతం, ఎస్బీఐలో 6.05 శాతం, కెనరా బ్యాంకులో 6.25 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 6 శాతంగానే ఉంది. సీనియర్ సిటిజెన్లకు దాదాపు 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ ఎక్కువ వస్తుంది. ఎస్బీఐలో ఐదేళ్ల వ్యవధికి సీనియర్ సిటిజెన్లకు 7.05 శాతంగా వడ్డీ రేటు ఉంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లోనూ సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఐదేళ్ల ఎఫ్‌డీపై అత్యధికంగా 7.90 శాతం వడ్డీనే అందుతుంది.