హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (NPA)లో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఉదయ్ కృష్ణారెడ్డి మోతీనగర్‌లోని బంధువుల ఇంట్లో శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఎస్సార్ నగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల మహిళా ఐపీఎస్ అధికారిణి శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి కూడా ఇక్కడే శిక్షణలో ఉన్నారు. ఈ ఏడాది జూన్ 23 నుంచి ఉదయ్ తన వాట్సప్ నంబర్‌కు అసభ్యకర సందేశాలు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఆరోపించారు. గౌరవానికి భంగం కలిగించేలా స్నేహితుల ముందు మాట్లాడటంతో పాటు వేరే వారితో వివాహేతర సంబంధం అంటగట్టి ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.బాధితురాలు అందించిన వివరాల ప్రకారం.. ఉదయ్ కృష్ణారెడ్డి బలవంతంగా ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని వ్యక్తిగత సందేశాలు చూశారని, ఈ నెల 8న గదిలోకి లాక్కెళ్లి బెదిరించి ఫోన్ పాస్‌వర్డ్ సేకరించారని తెలిపింది. జూలై 9న రాత్రి జుట్టు పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి గొంతు పిసికి, మెడపై కత్తి పెట్టి భయభ్రాంతులకు గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా.. జూలై 10న అసభ్యకరంగా ప్రవర్తించి వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి ఆ వీడియోలు తన భర్తకు పంపి బెదిరింపులకు పాల్పడినట్లు సదరు మహిళా అధికారిణి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ వద్ద పెరుగుతూ కూరగాయలు అమ్మిన ఆయన.. 2013లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. చేసి పట్టుదలతో ఐదో ప్రయత్నంలో 360వ ర్యాంక్‌ సాధించి ఐపీఎస్‌ సాధించారు. అయితే, శిక్షణ సమయంలో తోటివారిని ఇబ్బంది పెట్టడం, వాట్సప్ గ్రూపుల ద్వారా తప్పుడు ప్రచారాలు చేయడం వంటివి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఐపీఎస్ హోదాపై అనిశ్చితి నెలకొన్న తరుణంలోనే ఆయన ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. కానిస్టేబుల్ స్థాయి నుంచి సివిల్ సర్వీసెస్‌లో సత్తా చాటి ఐపీఎస్‌గా ఎంపికైన ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక ఆరోపణలు ఎదుర్కొని ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం పోలీస్ వర్గాల్లోనూ, సాధారణ ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది.