రాష్ట్రంలో మాతా, శిశు సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు రవాణా సౌకర్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరిన్ని నూతన సౌకర్యాలతో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను సిద్ధం చేశారు. ఈ వాహనాలను ముఖ్యమంత్రి నారా నాయుడు సోమవారం తన క్యాంపు కార్యాలయం వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల రూపకల్పన, వాటిలో ఏర్పాటు చేసిన భద్రతా ప్రమాణాలు, కల్పించిన సౌకర్యాలను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా తల్లీబిడ్డల అవసరాలకు అనుగుణంగా వాహనాలలో కొత్తగా చేసిన మార్పుల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరోవైపు గర్భిణులు, బాలింతలకు ఉచితంగా సేవలు అందించేందుకు ఈ వాహనాలను ఏర్పాటు చేశారు. గర్భిణులను ఆస్పత్రులకు తీసుకురావడానికి, అలాగే ప్రసవం అనంతరం బాలింతలు, పిల్లలను క్షేమంగా ఇళ్లకు చేర్చేందుకు ఈ వాహనాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్నవాటికి అదనంగా మరిన్ని సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలతో సిద్ధం చేసిన 500 వాహనాలను త్వరలోనే ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పరిశీలించారు. ఈ వాహనాలు అందుబాటులోకి వస్తే ఏటా 2.75 లక్షల మంది గర్భిణులు, బాలింతలు లబ్ధి పొందుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.కొత్త తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలలో ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. వెనుక సీట్లలో కూడా సీటు బెల్టులు ఏర్పాటు చేశారు. అలాగే బాలింతలు వాహనంలోకి సులభంగా ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా ఫుట్‌రెస్ట్ ఉంది. ఫస్ట్ ఎయిడ్ కిట్, ఎయిర్ కండిషనింగ్ (ఏసీ), అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనాలను జీపీఎస్ ట్రాకర్లు ఏర్పాటు చేశారు. ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా వాహనాల కదలికలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. నూతన వాహనాలపై స్టిక్కరింగ్ పూర్తి చేసి, త్వరలోనే అన్ని జిల్లాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.