దాయాది పాకిస్థాన్ ఒకేసారి పలు రంగాల్లో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఓవైపు సాయుధ తిరుగుబాటు, మరోవైపు, ఇంకోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. ఇలా ఇస్లామాబాద్‌ అధికార యంత్రాంగం తానే స్వయంగా కొనితెచ్చుకున్న ఒక అప్రకటిత యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా (KP) నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్, అఫ్గనిస్థాన్ సరిహద్దుల వరకు.. సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ నేతృత్వంలోని పాకిస్థాన్ వ్యవస్థ ప్రస్తుతం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న నాలుగు విభిన్న సంక్షోభాలను ఎదుర్కొంటోంది. .. 'తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్' (TTP) ఖైబర్ పఖ్తుంఖ్వాలో భద్రతా దళాలపై విరుచుకుపడుతూ.. బలూచ్‌లోని పష్తూన్ ప్రాంతాలకు విస్తరిస్తోంది.అటు పీఓకేలో రాజకీయ ప్రాతినిధ్యం, హక్కులు, వనరుల కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం.. అరెస్టులు, హత్యలు, ఇంటర్నెట్ నిషేధాలను సైతం తట్టుకుని నిలబడింది. ఈ వివాదాస్పద ప్రాంతంలోకి పాక్ ప్రభుత్వం ఏకంగా 8,000 మందికి పైగా అదనపు బలగాలను మోహరించింది. మరోవైపు, డ్యూరాండ్ లైన్ (సరిహద్దు) వద్ద ఒకప్పుడు మిత్రులుగా ఉన్న తాలిబాన్లు ఇప్పుడు శత్రువులుగా మారారు. కాబూల్‌లోని సెరెనా హోటల్ లాబీలో కూర్చుని టీ తాగుతూ చెప్పుకునే 'దువా-సలాం'ల స్థానంలో ఇప్పుడు వైమానిక దాడులు, డ్రోన్లు, మోర్టార్ల మోతలు వినిపిస్తున్నాయి.అంతర్జాతీయ టెర్రరిజం ఇండెక్స్ 2026 ప్రకారం.. గతేడాది పాకిస్థాన్‌లో 1,139 ఉగ్రవాద సంబంధిత మరణాలు నమోదయ్యాయి. 2013 తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ ఏడాది జూన్‌లో దాడులు కాస్త తగ్గినట్లు కనిపించినా.. ఇస్లామాబాద్‌కు చెందిన 'పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్' ప్రకారం ఆ ఒక్క నెలలోనే 118 దాడులు, 112 మరణాలు, 148 మంది గాయపడినట్లు రికార్డయ్యింది.ఉగ్రవాదం ఎప్పటికీ సమర్థించలేనిదే అయినప్పటికీ.. ఈ వినాశనానికి పాకిస్థాన్ దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానమే కారణం. ‘‘రోజువారీ దాడులు జరుగుతున్నాయి.. ఒకరోజు ఖైబర్ పంఖ్త్వుఖా.. మర్నాడు బలూచిస్థాన్.. మళ్లీ కేపీ. మా నాలుగు ప్రావిన్సుల్లోని రెండు రాష్ట్రాలలో ఇప్పుడు పూర్తిగా యుద్ధం లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం’’ అని బహావల్‌పూర్ పారిశ్రామికవేత్త బిలాల్ ఖాలిద్ ఎక్స్ (ట్విట్టర్) లో ఆవేదన వ్యక్తం చేశారు.ఈ తరుణంలోనే అఫ్గన్ మాజీ వైస్ ప్రెసిడెంట్, ఇంటెలిజెన్స్ చీఫ్ అమ్రుల్లా సలేహ్ జులై 13న సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘‘మన ప్రాంతంలో ఒక కొత్త దేశం జన్మించబోతోందనే ప్రాథమిక సంకేతాలు కనిపిస్తున్నాయి.. ఆ దేశం పేరు ఏంటో ఊహించండి’’ అని ఆయన నిగూఢ అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు. ఏ భూభాగాన్ని ఉద్దేశించి ఆయన అన్నారనేది స్పష్టత ఇవ్వనప్పటికీ దేశ సైనిక యంత్రాంగం ప్రతిరోజూ దెబ్బతింటున్న తీరు జనరల్ అసిమ్ మునీర్ ఆశించే దానికి పూర్తి భిన్నంగా ఉంది. నాలుగువైపుల నుంచి ఎదుర్కొంటోన్న సవాళ్లు పాక్ మేధావుల్లో సైతం పలు ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చలానీ స్పందిస్తూ.. పాక్ ప్రస్తుతం ప్రభుత్వ అధికార సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, రాజకీయ హక్కుల నిరాకరణ, అణచివేత వల్లే ఈ నిరసనలు, తిరుగుబాట్లు వస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం తుపాకీలతోనే పాలించాలనుకునే ఇస్లామాబాద్ భద్రతా విధానాల పరిమితులను ఈ పరిస్థితులు బట్టబయలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.బలూచ్‌లో ఇద్దరు శత్రువులతో పోరాటం1948లో మోసపూరితంగా పాకిస్థాన్ ఆక్రమించుకున్నప్పటి నుంచి బలూచీస్థాన్‌లో సాయుధ ప్రతిఘటన కొనసాగుతోంది. రాజకీయంగా ప్రాధాన్యత లేకపోవడం, వనరుల దోపిడీ, యువత అపహరణలతో అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మరోవైపు, మాహ్రంగ్ బలోచ్ వంటి శాంతియుత ఉద్యమకారులపై కూడా జీవిత ఖైదులు, అక్రమ అరెస్టులు విధిస్తున్నారు. ఇటీవల జియారత్ జిల్లా మంగీ డ్యామ్ సమీపంలోని పోలీస్ పోస్ట్‌పై టీటీపీ (TTP) ఉగ్రవాదులు దాడి చేసి ఇద్దరు ఎస్‌హెచ్‌ఓలతో సహా తొమ్మిది మంది పోలీసులను చంపారు. మరో 18 మందిని అపహరించి, ఆ తర్వాత హతమార్చారు.రెండు రోజుల తర్వాత లాస్బెలా జిల్లాలో పాక్ సైనిక కాన్వాయ్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేసిన దాడిలో 11 మంది సైనికులు మరణించారు. కేవలం నాలుగు రోజుల్లోనే కనీసం 38 మంది భద్రతా సిబ్బంది, నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల జరిగిన ఒక ర్యాలీలో జేయూఐ-ఎఫ్ చీఫ్ మౌలానా ఫజ్లూర్ రెహమాన్ మాట్లాడుతూ.. ‘‘తన యూనిఫాం తీసేసి ఎన్నికల్లో అసిమ్ మునీర్ పోటీ చేయాలి. ఈ రోజు బలూచిస్థాన్‌లో పాక్ ప్రభుత్వ అధికారం ఎక్కడా కనిపించడం లేదు’ అని సవాల్ విసిరారు.బలూచ్‌లో పాకిస్థాన్‌లో ఎదురవుతున్న అతి పెద్ద సవాలు ఏమిటంటే.. భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన ఇద్దరు శత్రువులతో పోరాడుతోంది. స్వతంత్ర బలూచిస్థాన్‌ను బీఎల్ఏ కోరుతుంటే, టీటీపీ తమ సొంత ఇస్లామిక్ పాలను తీసుకురావాలని చూస్తోంది. బలోచ్ ప్రాంతాల్లో బీఎల్ఏ; పష్తూన్ ప్రాంతాల్లో టీటీపీ తన ఉనికిని చాటుకుంటోందని జర్నలిస్ట్ ఇహ్సానుల్లా తిపు మెహసూద్ పేర్కొన్నారు. జనవరిలో 10 నగరాల్లో ఒకేసారి బలోచ్ లిబరేషన్ ఆర్మీ జరిపిన దాడులు.. తాము పట్టణ ప్రాంతాలు, పోలీస్ స్టేషన్లను, రైల్వే లైన్లను సైతం ఆక్రమించగలరని నిరూపించాయి. ఎక్స్ (ట్విట్టర్)లో మీర్ యార్ బలోచ్ అనే ఖాతాలో.. బలూచిస్థాన్‌లోని 85% ప్రాంతం ప్రస్తుతం పాక్ ప్రభుత్వం చేతుల్లో లేదు, బలోచ్ విముక్తి దళాల నియంత్రణలోనే ఉంది.ఖైబర్ పఖ్తుంఖ్వాలో టీటీపీ విధ్వంసంఒకవైపు పాక్ సైన్యాన్ని బీఎల్ఏ ముప్పతిప్పలు పెడుతుంటే, ఇంకోవైపు ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యంగా గిరిజన ప్రాంతాలైన వజీరిస్థాన్, బన్నూ, బజౌర్, డెరా ఇస్మాయిల్ ఖాన్‌లలో నిత్యకృత్యంగా మారాయి. ఇటీవల బన్నూ, అప్పర్ దిర్ ప్రాంతాల్లో జరిగిన ఆత్మాహుతి, సాయుధ దాడుల్లో ముగ్గురు పోలీసులు చనిపోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. టీటీపీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లపై దాడుల కోసం డ్రోన్లను కూడా వాడుతోంది. మే నెలలో అమెరికా భద్రతా కారణాల దృష్ట్యా పెషావర్‌లోని తన మిషన్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.టీటీపీని ‘ఫిత్నా అల్-ఖవారిజ్’ అని పేర్కొంటూ తాము ఎంతోమంది ఉగ్రవాదులను చంపుతున్నామని పాక్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, 2022 నవంబర్‌లో కాల్పుల విరమణ ముగిసినప్పటి నుంచి ఆ సంస్థ మరింత బలాన్ని పుంజుకుంది. ఇప్పుడు ఖైబర్ పఖ్తుంఖ్వాలోనే కాదు.. బలూచిస్థాన్‌లో క్వెట్టా వరకు దీని నెట్‌వర్క్ విస్తరించడంతో పాక్ సైన్యం తన బలగాలను ఎటు పంపాలో తెలియక సతమతమవుతోంది.పీఓకేలో ప్రజా ఉద్యమంపాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎదురవుతున్న సవాలు సాయుధ పోరాటం కాదు, అది ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్న ప్రజా ఉద్యమం. కానీ పాక్ ప్రభుత్వం దీనిని కూడా ఉగ్రవాదం లాగే చూస్తోంది. గత నెల రోజులుగా 'జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ' (JAAC) ఆధ్వర్యంలో ద్రవ్యోల్బణం, విద్యుత్ ఛార్జీలు, నిత్యావస ధరలు, శరణార్థుల కోసం కేటాయించిన 12 అసెంబ్లీ స్థానాలకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఈ సీట్ల ద్వారా ఇస్లామాబాద్ స్థానిక ప్రాతినిధ్యాన్ని దెబ్బతీస్తోందనేది పీఓకే ప్రజల ఆరోపణ.నాయకుల అరెస్టులు, ఇంటర్నెట్ బంద్, యాంటీ టెర్రరిజం చట్టాల కింద జాక్ను నిషేధించినప్పటికీ ఉద్యమం ఆగలేదు. జులై 14న జరిగిన ఘర్షణల్లో కనీసం తొమ్మిది మంది మరణించారు. రావాలాకోట్ నుంచి ముజఫరాబాద్‌కు ప్రతిపాదించిన మార్చ్‌ను అడ్డుకోవడానికి పాక్ ప్రభుత్వం 4,000 మంది రేంజర్లు, బలగాలను దింపి మీడియా బ్లాక్‌అవుట్ విధించింది.జాక్ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ మొదట తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం కశ్మీరీలకు ఆయుధాలు ఇచ్చి వాడుకుంది, ఇప్పుడు తమ హక్కుల కోసం పోరాడుతుంటే ఉగ్రవాదులని ముద్ర వేస్తోంది’’ అని మండిపడ్డారు. పీఓకే ప్రశాంతంగా ఉందని ప్రపంచానికి చెప్పుకునే ఇస్లామాబాద్ చెప్పుకునే అబద్ధాలను, అక్కడ వినబడుతున్న భారత అనుకూల నినాదాలు బట్టబయలు చేస్తున్నాయి. శత్రువుగా మారిన అఫ్గన్ సరిహద్దుఐదేళ్ల కిందట కాబూల్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పుడు పాకిస్థాన్ సంబరాలు చేసుకుంది. కానీ నేడు అదే అఫ్గన్ సరిహద్దు పాక్‌ ఒక యుద్ధరంగంగా మారింది. టీటీపీ నాయకులకు తాలిబాన్లు ఆశ్రయం ఇస్తున్నారని ఇస్లామాబాద్ ఆరోపిస్తుంటే, ఇది పాక్ అంతర్గత సమస్య అని కాబూల్ కొట్టిపారేస్తోంది. జూన్ నెలలో కరాచీలోని రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై దాడి తర్వాత, పాక్ సైన్యం అఫ్గనిస్థాన్‌లోని పక్తియా, కునార్ ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. ఇందులో 28 మంది పౌరులు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది.దీనికి ప్రతికారంగా, తాలిబాన్ సైన్యం ఫిబ్రవరిలో ఇస్లామాబాద్ సమీపంలోని పాక్ సైనిక స్థావరాలపై వైమానిక, డ్రోన్ దాడులు చేయడం గమనార్హం. డ్యూరాండ్ రేఖ వద్ద జరిగే ప్రతి దాడి కూడా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పష్తూన్ ప్రజల్లో ద్వేషాన్ని పెంచుతోంది.కొత్త దేశం ఆవిర్భావం తప్పదా?అఫ్గన్ మాజీ నేత అమ్రుల్లా సలేహ్ అన్నట్లు కొత్త దేశం ఆవిర్భావం అంత సులువు కాకపోవచ్చు. ఎందుకంటే బీఎల్ఏ, టీటీపీ, జాక్‌, అఫ్గన్ తాలిబాన్‌లకు వేర్వేరు లక్ష్యాలు, విభిన్న సిద్ధాంతాలు ఉన్నాయి. అవి ఒకదానికొకటి శత్రువులు కూడా. కానీ ఇవన్నీ కలిసి పాకిస్థాన్ ప్రభుత్వ అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని పూర్తిగా సవాలు చేస్తున్నాయి.ఇటీవల పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘‘దేశం ముక్కలైపోతోంది. ఈ రోజు రెండు రాష్ట్రాల్లో వేర్పాటువాద ఉద్యమాలు తీవ్రంగా ఉన్నాయి’ అని హెచ్చరించారు.భారత వ్యూహాత్మక నిపుణుడు సుశాంత్ సరీన్ అభిప్రాయం ప్రకారం.. ఈ అంతర్గత ఒత్తిడి, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్‌పై ఏదైనా దుస్సాహసానికి పాకిస్థాన్ ఒడిగట్టే ప్రమాదం కూడా ఉంది. ఏదేమైనా, ఇస్లామాబాద్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈమంటలు దానికి ఉనికిని ప్రశ్నిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.