ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువ కావాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి నేరుగా.. ప్రజలతో ఫోన్‌లో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన కాల్స్‌లో ప్రజలు రెవెన్యూ, భూ వివాదాలు, తాగునీటి సమస్యలు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాల అమలు వంటి పలు అంశాలను మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకువచ్చారు.ప్రజల నుంచి వచ్చిన ప్రతీ వినతిని ఓపికగా విన్న మంత్రి కొండా సురేఖ.. సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్నతో పాటు పలువురు అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. తనకు పదవులతో ఎలాంటి సంబంధం లేదని.. ప్రజాసేవలోనే నిజమైన సంతోషాన్ని వెతుక్కుంటున్నానని.. ప్రజల సమస్యలు పరిష్కారమై వారి ముఖాల్లో చిరునవ్వు చూడటమే తనకు అసలైన సంతృప్తి అని మంత్రి తెలిపారు.ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని పేర్కొన్న మంత్రి కొండా సురేఖ.. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి వినతిని తన వ్యక్తిగత సమస్యగా భావించి పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే కాకుండా హైదరాబాద్‌లోని సెక్రటేరియట్, జూబ్లీహిల్స్‌లోని ఇల్లు, బంజారాహిల్స్ క్యాంపు కార్యాలయాల్లో కూడా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ అధికారులతో సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని మంత్రి కొండా సురేఖ తేల్చి చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని.. జవాబుదారీతనం, పారదర్శకత, ప్రజా కేంద్రిత పాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.