తమిళనాడు సీఎం విజయ్‌‌పై అనుచిత వ్యాఖ్యలు.. మరో డీఎంకే ఎమ్మెల్యే అరెస్టు

Wait 5 sec.

తమిళనాడు ముఖ్యమంత్రి, పై అనుచిత, బెదిరింపు వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై జి. ఆర్. మార్కండేయన్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును నిరసిస్తూ డీఎంకే కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం తూత్తుకుడి ఎస్పీ కార్యాలయంలో డీఎంకే ఎమ్మెల్యేను విచారిస్తున్నారు. ఇటీవల ఓ బహిరంగ సభలో మార్కెండేయన్ విజయ్‌ను ఉద్దేశించిన డీఎంకే ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.కొలత్తూరు నియోజకవర్గంలో ఓటమి‌ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి విజయ్ చేసిన ‘తండ్రి కోసం వెతుకులాట’ అనే వ్యాఖ్యలపై మార్కండేయన్ తీవ్రంగా స్పందించారు. జులై 18న కోవిల్‌పట్టిలో డీఎంకే ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘‘శాసనసభలో ముఖ్యమంత్రి తాము తండ్రి కోసం వెతుకుతున్నట్లు మాట్లాడుతున్నారు. సిగ్గులేని సీఎం... అసెంబ్లీలో నిన్ను ఎలా చూసుకోవాలో మేము చూసుకుంటాం... ఆయన అసెంబ్లీ తలుపులు లాక్ చేస్తానని అంటున్నారు... ఒకవేళ ఆయన డోర్లు మూస్తే ఆయన ఎముకలు విరిగిపోతాయి. లాక్ చేసి చూపించమనండి’’ అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో డీఎంకే ఎమ్మెల్యేపై తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి చెందిన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదుచేసి, అదుపులోకి తీసుకున్నారు. కాగా, దీనికి ముందు తిరుచెందూర్ డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్‌ను కూడా ఇలాంటి కేసులోనే పోలీసులు అరెస్ట్ చేయగా, అదే రోజు ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులో అనితా రాధాకృష్ణన్‌‌కు మద్రాసు హైకోర్టు మందస్తు బెయిల్ నిరాకరించడం గమనార్హం.మార్కండేయన్ అరెస్టుకు సంబంధించిన వైరల్ వీడియోలో.. తాను ఎమ్మెల్యే అయినందున అసెంబ్లీ స్పీకర్ అనుమతి లేకుండా తనను అరెస్టు చేయలేరని పోలీసులతో ఆయన చెప్పడం గమనార్హం. ఆయన మద్దతుదారులు ఆయన ఇంటి ముందు నిరసన తెలుపుతున్నప్పటికీ, పోలీసులు ఆయనను ఒప్పించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఈ అరెస్టును ప్రతిపక్ష డీఎంకే ఖండించింది. అధికార పక్షం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ ఆరోపించింది.