హిమాలయాల్లో కనిపించే అరుదైన పాముకి టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో పేరు

Wait 5 sec.

పశ్చిమ హిమాలయాల్లో గుర్తించిన అరుదైన సర్పజాతికి ప్రముఖ హాలీవుడ్ హీరో, పర్యావరణవేత్త లియోనార్డో డికాప్రియో పేరును శాస్త్రవేత్తలు ఖరారు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. డికాప్రియో పేరు వినగానే ఆయన సినిమాలు గుర్తొచ్చినప్పటికీ వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం సుదీర్ఘంగా అందిస్తున్న సేవలకు గౌరవ సూచికంగా ఈ ఆస్కార్ అవార్డు గ్రహీత పేరును సూచించారు. భారత్, నేపాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన పామును కేవలం ఒక కొత్త జాతిగానే కాకుండా.. ప్రజాతిగా గుర్తించడం ఆవిష్కరణ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల కాలంంలో హిమాలయాల్లో అత్యంత కీలకమైన ఆవిష్కరణలో ఒకటిగా ఇది నిలిచింది. దశాబ్దాలుగా అన్వేషణలు జరుగుతున్నప్పటికీ, పశ్చిమ హిమాలయాలు ఇప్పటికీ సైన్స్‌కు తెలియని ఎన్నో జీవజాతులను తమ గర్భంలో దాచుకున్నాయనడానికి ఈ ఆవిష్కరణే ఒక నిదర్శనం.శాస్త్రీయంగా 'ఆంగుయికులస్ డికాప్రియోయి' అని పిలిచే ఈ చిన్న పాము విషరహితమైంది, శాంత స్వభావం కలిగింది. దీని పొడవు సుమారు 40- 56 సెంటీమీటర్ల మాత్రమే ఉంటుంది. ఇండియాలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌తో పాటు నేపాల్‌లోని చిత్వాన్ జాతీయ పార్క్‌లోనూ అరుదైన పాము ఉనికిని గుర్తించారు. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయని పరిశోధకులు తెలిపారు. హిమాచల్‌లో చేపట్టిన క్షేత్రస్థాయి పరిశోధనలో ఈ పాము 2020లో తొలిసారిగా వెలుగుచూసింది. అనంతరం భారత్, జర్మనీ, యూకే పరిశోధకులు బృందం లోతైన జన్యుపరమైన, స్వరూప విశ్లేషణల ద్వారా ఒక ప్రత్యేకమైన ప్రజాతి అని 2024లో అధికారికంగా ధ్రువీకరించింది.ఈ సరీసృపం ప్రపంచంలోనే అతిపెద్ద పాముల కుటుంబమైన ‘కొలుబ్రిడే’ వర్గానికి చెందింది. ఈ కుటుంబానికి చెందిన జీవులు వివిధ ఖండాలలో రకరకాల భౌగోళిక వాతావరణణాలో విస్తరించి ఉన్నాయి. అయినప్పటికీ, పశ్చిమ హిమాలయాల్లో ఇప్పటికీ సైన్స్ దృష్టికి రాని లేదా వాటికి దగ్గరి పోలికలున్న ఇతర జీవులతో పోల్చి గందరగోళానికి గురైన సరికొత్త జీవజాతులను నిరంతరం బయటపెడుతూనే ఉంది.శాస్త్రవేత్తలు లాటిన్ భాష నుంచి ‘అంగుకులస్’ అనే పదాన్ని తీసుకుని కొత్త ప్రజాతిగా గుర్తించారు. సాపేక్షంగా ఇది దాని చిన్న పరిమాణాన్ని సూచిస్తుంది. ఈ పాముకు సాధారణ ఆంగ్ల నామం 'హిమాలయన్ స్నేక్' అని కూడా పెట్టారు. కానీ, పూర్తి జాతి 'డికాప్రియోస్ హిమాలయన్ స్నేక్'గా గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా, కుల్లు, సిమ్లా వంటి ప్రాంతాల నుంచి ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ వరకు.. నేపాల్‌లోని చిత్వాన్ నేషనల్ పార్క్ వరకు వ్యాపించి ఉన్నట్లు తెలిసింది. ఇది ఈ జాతి మొదట్లో ఊహించిన దానికంటే విస్తృతమైన హిమాలయ ప్రాంతంలో నివసిస్తుందని సూచిస్తుంది.