Reliance Consumer Products: టెలికాం రంగంలో జియోతో, రిటైల్ మార్కెట్లో జుడియో వంటి బ్రాండ్లకు పోటీగా తన నెట్‌వర్క్‌తో సంచలనాలు సృష్టించిన ముకేశ్ అంబానీ- ఇప్పుడు FMCG రంగంపై కన్నేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) చరిత్రలో తొలిసారిగా ఎబిటా (EBITDA) పాజిటివ్‌గా నమోదవడమే కాకుండా బ్రేక్ ఈవెన్ (ఖర్చులు- ఆదాయాలు సమానం కావడం) సాధించింది. కేవలం నష్టాల్ని అధిగమించడమే కాదు రాబోయే రోజుల్లో ఏకంగా రూ . 1 లక్ష కోట్ల ఆదాయమే లక్ష్యంగా అంబానీ కంపెనీ భారీ రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. మార్కెట్ లీడర్‌షిప్ కోసం రిలయన్స్ తీసుకుంటున్న దూకుడైన వ్యూహాలేంటో తెలుసుకుందాం. తొలిసారి ప్రాఫిట్ జోన్‌లోకి- గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నుంచి మార్చి 2026 వరకు ఈ బిజినెస్ రూ. 125 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేయగా, ప్రస్తుత జూన్ త్రైమాసికంలో కంపెనీ గ్రాస్ రెవెన్యూ రెండింతలు పెరిగి ఏకంగా రూ. 8600 కోట్లకు చేరింది. ఇంకా నిర్వహణ లాభాల పరంగా తొలిసారి పాజిటివ్‌లోకి వచ్చేసింది. టార్గెట్ రూ. 1 లక్ష కోట్లు- ఆర్థిక సంవత్సరం 2030 నాటికి ఈ ఎఫ్ఎంసీజీ వ్యాపారాన్ని రూ .1 లక్ష కోట్ల స్థాయికి చేర్చడమే తమ ప్రధాన లక్ష్యమని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేతన్ మోదీ తెలిపారు. సరఫరా వ్యవస్థ, సరికొత్త మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం కంపెనీ ఏకంగా రూ. 30 వేల కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఇందులో ఇప్పటికే రూ. 10 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టడం పూర్తయింది. క్విక్ కామర్స్ మార్కెట్‌ను క్యాష్ చేసుకునేందుకు రానున్న 9 నుంచి 12 నెలల పాటు డార్క్ స్టోర్ల విస్తరణను మరింత వేగవంతం చేయనున్నారు. Read Also: ప్రస్తుతం రిలయన్స్ ప్రధాన ఫోకస్ లాభాల కంటే మార్కెట్ వాటాను వేగంగా పెంచుకోవడంపైనే ఉందని యాజమాన్యం స్పష్టం చేసింది. కూల్ డ్రింక్స్ మార్కెట్లో పెప్సికో, కోకాకోలాకుగట్టి పోటీ ఇస్తూ కాంపా కోలా బ్రాండ్ అత్యంత వేగంగా డబుల్ డిజిట్ మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఇక్కడ తక్కువ ధర వ్యూహంతో దేశవ్యాప్తంగా 30 లక్షలకుపైగా అవుట్‌లెట్స్‌కు చేరింది.Read Also: నిత్యావసర వస్తువుల విభాగంలో అత్యంత నమ్మకమైన బ్రాండ్‌గా 'ఇండిపెండెన్స్' ఎదుగుతోంది. క్వాలిటీ ప్రొడక్ట్స్‌ను తక్కువ ధరలకే అందిస్తూ నేరుగా ఐటీసీ, పతంజలి వంటి సంస్థలతో తలబడుతోంది. ఇంకా ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్స్, ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కుల్ని నిర్మిస్తోంది. రానున్న మూడేళ్లలో ఆసియాలోనే అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ నెట్‌వర్క్‌గా ఎదగాలని ప్లాన్ చేస్తోంది. 'మా లక్ష్యం కేవలం మార్కెట్లో ఉండటం కాదు. ప్రతి కేటగిరీలోనూ నంబర్- 1 లీడర్ షిప్ స్థానాన్ని దక్కించుకోవడం' అని రిలయన్స్ ప్రతినిధులు స్పష్టం చేశారు. కంపెనీ పూర్తి సప్లై చెయిన్, మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఉత్పత్తి వ్యయం తగ్గి, ఎబిటా లాభాలు మరింత భారీగా పెరుగుతాయని సంస్థ భావిస్తోంది.