కాకినాడ జిల్లా తునిలో రాష్ట్రవ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసులో వివిధ కోణాలలో దర్యాప్తు చేపట్టినప్పటికీ ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో చిన్నారి కాసేపు కనిపించకుంటే తల్లిదండ్రులు కంగారు పడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో నంద్యాల జిల్లాలో జరిగిన ఓ ఘటన పోలీసులను పరుగులు తీయించింది. నంద్యాల శివారు ప్రాంతంలో ఆరేళ్ల చిన్నారి కనిపించకుండా పోవటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఆరేళ్ల చిన్నారి ఆదివారం రోజున ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయింది. ఆ సమయంలో కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లో లేనట్లు సమాచారం.కొద్దిసేపటి తర్వాత పాప తల్లి.. కుమార్తె కనిపించని విషయం గుర్తించింది. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందా అని గాలించింది. ఆ వీధి మొత్తం తిరిగినా పాప జాడ తెలియలేదు. దీంతో తన ఆరేళ్ల పాప కనిపించడం లేదంటూ ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించింది. తుని జ్ఞానేశ్వరి ఘటన నేపథ్యంలో నంద్యాల పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎస్పీ సునీల్ షొరాన్ రాత్రంతా ఆ ప్రాంతంలోనే మకాం వేశారు. సుమారుగా 200 మంది పోలీసులు రాత్రంతా పాప కోసం గాలించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పట్టారు. డ్రోన్ కెమెరాలు, పోలీసు జాగిలాల సాయంతో చిన్నారి కోసం గాలించారు. ఈ క్రమంలోనే చిన్నారి వీధులలో తిరుగుతున్న సీసీ ఫుటేజీ కనిపించింది. ఈ ఫుటేజీ ఆధారంగా ఆదివారం రాత్రంతా గాలించినా పాప జాడ తెలియలేదు. ఇక సమీపంలోని జొన్న చేనులో సోమవారం తెల్లవారుజామున పోలీస్ బృందాలు కూంబింగ్‌ నిర్వహించారు. జొన్న చేనులో చిన్నారి నిద్రపోతూ కనిపించడంతో.. పోలీసు బృందాలు ఊపిరి పీల్చుకున్నాయి. పాపను తల్లి చెంతకు చేర్చాయి. ఫిర్యాదు అందిన కొన్ని గంటల్లోనే పాపను పోలీసులు గుర్తించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.