హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన లైంగిక వేధింపుల కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదైన తర్వాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డిపై కావాలనే కుట్ర జరుగుతోందని ప్రణయ్ ఆరోపించారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎన్నో కష్టాలు పడి ఐపీఎస్ స్థాయికి చేరుకున్న తన అన్న ఉదయ్ కృష్ణారెడ్డిపై వస్తున్న ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయని చెప్పారు. నేషనల్ పోలీస్ అకాడమీలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఒక మహిళా ట్రైనీని గదిలోకి బలవంతంగా తీసుకెళ్లి కత్తితో బెదిరించడం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. మహిళా ట్రైనీ చేసిన ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలు, చాటింగ్‌లు, వీడియోలు ఉదయ్ వద్ద ఉన్నాయని.. అవి వెలుగులోకి వస్తే నిజాలు బయటపడతాయని ప్రణయ్ పేర్కొన్నారు. చట్టంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, చివరకు న్యాయమే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.మరోవైపు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు వివరాలు వెల్లడించారు. సోమవారం ఉదయం అపస్మారక స్థితిలో ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చారని.. వెంటనే కడుపును శుభ్రం చేశామని తెలిపారు. అయితే ఆయన ఏ పదార్థం తీసుకున్నారనేది బ్లడ్ రిపోర్టులు వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఆయన బీపీ, పల్స్‌తో పాటు ఇతర కీలక ఆరోగ్య సూచికలు సాధారణంగానే ఉన్నాయని.. పూర్తిగా స్పృహలోకి రావడానికి మరో 24 గంటల సమయం పట్టవచ్చని వెల్లడించారు.ఇక ఈ వ్యవహారంలో నేషనల్ పోలీస్ అకాడమీ ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసి.. వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే తన అన్నను సస్పెండ్ చేయలేదని.. ఆయన ఎక్స్‌ట్రా ఆర్డినరీ లీవ్ (ఈఓఎల్)పై ఇంటికి వచ్చారని ప్రణయ్ స్పష్టం చేశారు. మరోవైపు.. మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.