బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

Wait 5 sec.

ఎండలు, వేడిగాలుల దెబ్బకు అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చల్లని కబురు చెప్పింది.. రాష్ట్రంలో వర్షాలు పడతాయని తెలిపారు. వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరాల్లో అల్పపీడనం ఏర్పడింది. అలాగే కోస్తాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం మేఘావృతమైన వాతావరణం ఉంటుంది.. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం.. కోస్తాలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు.. రాయలసీమలోని అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.. వర్షాలు పడే సమయంలో 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఉరుములు, ఈదురుగాలులు వచ్చేటప్పుడు చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ దగ్గర నిలబడొద్దని.. అలాగే తెగిపడిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లాని సోంపేటలో 2.4 సెంటీమీటర్లు, మందసలో 1.8, పలాసలో 1.6, పాతపట్నంలో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పార్వతీపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో.. నంద్యాల జిల్లాల్లో అక్కడడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి.మరోవైపు తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచి అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో కూడా శుక్రవారం వేకువజాము నుంచి వర్షం పడింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వాతావరణం కూడా మేఘావృతమై తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వానలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో జనాలకు కాస్త రిలీఫ్ దక్కింది.. మొన్నటి వరకు ఎండలు, వేడిగాలులతో ఇబ్బందిపడగా.. ఇప్పుడు వాతావరణం కాస్త చల్లడింది. అలాగే జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు రైతులకు కూడా కాస్త ఉపశమనాన్ని కలిగించాయి.