గుంటూరు జిల్లాలో అలర్ట్.. మూడు కోవిడ్ కేసులు నమోదు

Wait 5 sec.

కరోనా వైరస్ మరోసారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. కోవిడ్ -19 సృష్టించిన విధ్వంసం ప్రపంచం ఎప్పటికీ మరచిపోదు. కొన్ని కోట్ల మంది ఈ మహమ్మారి దెబ్బకు ప్రాణాలు విడిచారు. కరోనా ప్రభావంతో ఇప్పటికీ ఎంతోమంది బాధపడుతూనే ఉన్నారు. కరోనా వైరస్ వచ్చిన తర్వాత మరణాలు తగ్గుముఖం పట్టాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కరోనా కేసులు నమోదవ్వడం కలకలం సృష్టిస్తున్నాయి. .. తాజాగా ఇప్పుడు గుంటూరు జిల్లాలోనూ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో తాజాగా మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మంగళగిరి ప్రాంతంలోని ఇద్దరు మహిళలతో పాటు, కృష్ణా జిల్లాకు చెందిన ఒక వృద్ధురాలికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ కేసులు నమోదైన వారిలో ఒకరిది కేరళ రాష్ట్రం కావడం గమనార్హం. మంగళగిరి బాపయ్యనగర్, నవులూరు ప్రాంతాలకు చెందిన మహిళల్లో ఒకరిది కేరళ రాష్ట్రంగా అధికారులు చెబుతున్నారు. కోవిడ్ పాజిటివ్ అయినప్పటికీ వీరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. కృష్ణా జిల్లాకు చెందిన వృద్ధురాలికి కొన్నివ్యాధులు ఉండటంతో ఆమెను మాత్రం మంగళగిరి ఎయిమ్స్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరికి వైరస్ ఏ రకంగా సోకింది అన్న కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. వైరస్ మూలాలు తెలుసుకునేందుకు బాధితుల నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఒకే రోజు మూడు కేసులు నమోదవ్వడంతో బాధిత కుటుంబాలకు కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మి తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను స్వయంగా సమీక్షిస్తున్నారు. అదేవిధంగా జీజీహెచ్‌లో ర్యాపిడ్ పరీక్ష కిట్లు మరిన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది.