తల్లిదండ్రులకు కనీస బాధ్యత ఉండాలి.. బండి భగీరథ్ కేసుపై ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు రోడ్డు ప్రమాదం కేసుపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రమాదం చేసిన తర్వాత ఇంటికి వచ్చిన కుమారుడిని పోలీసులకు అప్పగించడం తల్లిదండ్రుల కనీస బాధ్యత అని.. న్యాయపరమైన పోరాటం చేయాలని పేర్కొన్నారు. అది కాకుండా ఒక వ్యక్తి చనిపోయినా ఆయన ఇలా మాట్లాడటం సరికాదని తెలిపారు. ఈ సందర్భంగా బండి భగీరథ్ పోక్సో కేసును ఉదాహరణగా నారా లోకేష్ ప్రస్తావించారు. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను.. ఆయన తండ్రి మాజీ మంత్రి కొడుకు యాక్సిడెంట్ చేసి భయంతో ఇంటికొస్తే.. చేసింది తప్పు అని చెప్పి.. పోలీసులకు సరెండర్ చేయాల్సిన కనీస బాధ్యత వారి తల్లిదండ్రులకు ఉండాలని నారా లోకేష్ తెలిపారు. తెలంగాణలో ఒక కేంద్రమంత్రి కొడుకుపై ఆరోపణలు వస్తే.. ఆయనే స్వయంగా తీసుకెళ్లి పోలీసుల ముందు తన కుమారుడిని సరెండర్ చేశారని పేర్కొన్నారు. సీదిరి అప్పలరాజు అది చేయకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతారా అని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సీదిరి అప్పలరాజు కుమారుడి ప్రమాదం కేసులో కూడా చట్టపరమైన ప్రక్రియకు సహకరించాల్సిన బాధ్యత అతని కుటుంబ సభ్యులపై ఉంటుందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందాడు. సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్‌.. శుక్రవారం రోజు రాత్రి ఈ యాక్సిడెంట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి 9.07 గంటలకు బైక్‌పై ఆరవ్‌ ఒక్కడే పెట్రోల్ బంకుకు వెళ్లి పెట్రోల్‌ పోయించుకున్నట్లు సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ వెంటనే పెట్రోల్‌ బంకు నుంచి 500 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాద సమాచారం తెలుసుకుని పోలీసులు అక్కడికి చేరుకునే లోపే ఆరవ్‌ను కారులో తరలించినట్లు తేల్చారు. కానీ ఈ కేసులో నిందితుడిగా ఆరవ్‌ను కాకుండా అతన్ని తప్పించిన పోలీసులు.. ఆరవ్‌కు బదులుగా అతని ఫ్రెండ్ సిద్ధార్థ త్యాడిని నిందితుడిగా చేర్చి.. అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.