తెలంగాణలో ఓటర్లకు భారీ ఊరట.. SIR గడువు పొడిగింపు.. ఎప్పటివరకు అంటే?

Wait 5 sec.

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును ఈనెల 24వ తేదీ నుంచి ఆగస్ట్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ పార్టీల విజ్ఞప్తులు, క్షేత్రస్థాయిలో సర్వే నెమ్మదిగా సాగుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తాజా షెడ్యూల్ ప్రకారం బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) ఆగస్ట్ 3వ తేదీ వరకు ఇంటింటి సర్వే, ఓటరు వివరాల సేకరణ, ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియను కొనసాగిస్తారు. ఆ తర్వాత ఆగస్ట్ 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత కొత్తగా ఓటు నమోదు, పేరు సవరణ, మార్పులు, అభ్యంతరాల స్వీకరణకు ఆగస్ట్ 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు గడువు కల్పించారు. ఈ దరఖాస్తులపై విచారణ, నోటీసుల జారీ, పరిష్కార ప్రక్రియను అక్టోబర్ 8వ తేదీ నాటికి పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక అక్టోబర్ 12వ తేదీన తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా పలు రాజకీయ పార్టీలు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎన్యుమరేషన్ ఫారాలు కూడా అందలేదని.. అందుకే ఎస్ఐఆర్ గడువు పెంచాలని చేసిన విజ్ఞప్తితో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త షెడ్యూల్‌ను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని.. రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది.అయితే.. ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసినట్లు.. ఎస్ఐఆర్ ప్రక్రియలో అవసరమైన ఫారాలు సమర్పించకపోతే లేదా వివరాలు నమోదు చేయకపోతే ఓటరు జాబితాలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి అర్హులైన ప్రతి ఓటరు నిర్ణీత గడువులోపు వివరాలను ధృవీకరించి అవసరమైన ఫారాలను సమర్పించాలని ఎన్నికల సంఘం అధికారులు సూచిస్తున్నారు.