సైబర్ బాధితులకు భారీ ఊరట.. నేరగాళ్లు కొట్టేసిన డబ్బు తిరిగి వెనక్కి.. సైబర్ పోలీసుల కీలక నిర్ణయం

Wait 5 sec.

సైబర్ మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకున్న వారికి (టీజీసీఎస్‌బీ) గుడ్‌న్యూస్ చెప్పింది. బాధితులు తమ డబ్బును సులభంగా తిరిగి పొందేందుకు మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ (ఎంఆర్ఎం)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా అర్హులైన బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లోనే రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకుని.. నేరుగా తమ బ్యాంకు అకౌంట్లలోకి డబ్బు పొందే అవకాశం కల్పించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, ఐపీఎస్ అధికారి శిఖా గోయెల్ ఈ వివరాలు వెల్లడించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) నుంచి రీఫండ్‌కు సంబంధించిన అధికారిక ఎస్ఎంఎస్ లేదా నోటిఫికేషన్ అందుకున్న బాధితులు మాత్రమే ఈ మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ సేవను వినియోగించుకోవచ్చు. బాధితుల అభ్యర్థనను చట్ట అమలు సంస్థలు, సంబంధిత బ్యాంకులు ధృవీకరించిన తర్వాత అర్హత ఉన్న వారి ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయనున్నారు.సైబర్ మోసాలకు గురైన బాధితులు రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకునే విధానంసైబర్ క్రైమ్ ఫిర్యాదుకు అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో లాగిన్ కావాలి.మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా గుర్తింపును ధృవీకరించాలి.అర్హత కలిగిన ఫిర్యాదు, సంబంధిత బ్యాంక్ ఖాతాను ఎంపిక చేయాలి.అవసరమైతే పాన్ కార్డు వివరాలను అప్‌లోడ్ చేయాలి.వివరాలను మరోసారి పరిశీలించి రీఫండ్ అభ్యర్థనను సమర్పించాలి.దరఖాస్తు విజయవంతంగా నమోదైనట్లు మెసేజ్ వచ్చిన తర్వాత.. ధృవీకరణ పూర్తయ్యాక డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.ఈ సందర్భంగా ప్రజలకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరోసారి అలర్ట్ చేసింది. రీఫండ్ త్వరగా ఇప్పిస్తామని చెప్పే మోసగాళ్లను నమ్మవద్దని హెచ్చరించింది. ఓటీపీలు, బ్యాంక్ పాస్‌వర్డ్‌లు, ఏటీఎం వివరాలు లేదా ఇతర గోప్యమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఇవ్వొద్దని సూచించింది. రీఫండ్ కోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో సహాయం అవసరమైన బాధితులు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెల్ప్‌డెస్క్‌ను లేదా తమ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారిని నేరుగా సంప్రదించాలని సూచించింది.