తమిళనాడు సీఎం, దళపతి విజయ్‌ హీరోగా నటించిన ‘జన నాయగన్‌’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ''అగ్ని పరీక్షలో నిలిచింది. కాలం మలిచిన రూపం. చరిత్ర కోసం నిర్మించబడింది. పోరాటం ఎంత కఠినంగా ఉంటే, విజయం అంత ఘనంగా ఉంటుంది'' అని పేర్కొన్నారు. ‘జన నాయగన్‌’ సినిమాని జులై 23న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగులో 'జన నాయకుడు'.. హిందీలో 'జన నేత' పేర్లతో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఓ న్యూ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో విజయ్ పోలీసాఫీసర్ గెటప్ లో చేతిలో పొడవాటి కత్తి పట్టుకొని నిలబడి ఉన్నారు. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 2026 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రావాల్సిన ‘జన నాయగన్‌’ మూవీ.. సెన్సార్‌ సమస్య కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ మధ్యలో కోర్టు కేసులు, విచారణలు, సీబీఎఫ్‌సీ పునః పరిశీలన తర్వాత.. అడ్డంకులను దాటుకొని ఇటీవలే సెన్సార్‌ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు ఈ మూవీకి ‘ఏ’ (A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దాదాపు 3 గంటలు (183 నిమిషాల) నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.సెన్సార్‌ కంప్లీట్ చేసుకున్న తర్వాత, ‘జన నాయగన్‌’ చిత్రాన్ని జులై 24న రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఒకరోజు ముందుగా ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కి హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించారు. KVN ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై వెంకట్‌ కె.నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా.. మమితా బైజు, బాబీ డియోల్, ప్రియమణి, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం సమకూర్చారు.