ఎస్బీఐ నుంచి స్పెషల్ FD స్కీమ్- అధిక వడ్డీ- రూ. 2 లక్షలు జమ చేస్తే నెలనెలా ఎంతొస్తుంది?

Wait 5 sec.

SBI Amrit Vrishti Scheme: భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి దేశవ్యాప్తంగా చూస్తే కోట్లల్లో కస్టమర్లు ఉంటారు. కస్టమర్లకు ఎన్నో రకాల సేవల్ని అందిస్తుంది. సేవింగ్స్, కరెంట్, శాలరీ, NRE అకౌంట్లు ఇవ్వడంతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లోన్లు, రికరింగ్ డిపాజిట్లు, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సేవల్ని ఆఫర్ చేస్తోంది. దిగ్గజ ప్రభుత్వ బ్యాంకు కాబట్టి చాలా మంది ఇందులో డిపాజిట్లు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. సాధారణ ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు రిస్క్ లేకుండా నిర్దిష్ట పెట్టుబడులపై నిర్ణీత కాల వ్యవధికి కచ్చితమైన రిటర్న్స్ ఇస్తుంటాయి. ఇప్పుడు ఎస్బీఐలో స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గురించి మనం తెలుసుకుందాం. సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రెండేళ్ల కిందట చూస్తే ఆకర్షణీయ స్థాయిలో వడ్డీ రేట్లు ఉండేవి. ఇతర పోస్టాఫీస్ పథకాలకు మించి రాబడి వచ్చేది. అప్పుడు ఆర్బీఐ రెపో రేటు గరిష్ఠంగా 6.50 శాతంగా ఉండేది. కానీ అక్కడి నుంచి ఆర్బీఐ వరుసగా రెపో రేటు తగ్గిస్తూ రావడంతో బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చాయి. దీంతో ఇవి కాస్త ఆకర్షణ కోల్పోయాయి. అయినప్పటికీ బ్యాంకులు డిపాజిట్లు చేసేందుకు జనాన్ని ప్రోత్సహించడంలో భాగంగా స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌తో ఇతర సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీనే అందిస్తున్నాయి. ఎస్బీఐలో కూడా ఇక్కడ 444 రోజుల ప్రత్యేక టెన్యూర్‌తో అమృత్ వృష్టి పథకం ఉంది. దీంట్లో మొదట్లో సాధారణ ప్రజలకు అత్యధికంగా 7.25 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.75 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేసేది. కానీ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలతో వడ్డీ రేట్లను 2-3 సార్లు తగ్గించాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రస్తుతం ఎస్బీఐలో సాధారణ ప్రజలకు ఈ టెన్యూర్‌పైనే అత్యధికంగా 6.45 శాతం వడ్డీ రేటు ఉంది. సీనియర్ సిటిజెన్లకు 6.95 శాతంగా వడ్డీ రేటు ఉండగా అత్యధికంగా ఐదేళ్ల డిపాజిట్‌పై వీరికి 7.05 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.Read Also: మరి రూ. 2 లక్షలు ఒకేసారి డిపాజిట్ చేస్తే ఎస్బీఐలో 444 రోజుల ప్రత్యేక డిపాజిట్‌పై వడ్డీ నెలనెలా, త్రైమాసిక ప్రాతిపదికన, ఏడాదిలో ఎంతొస్తుందో చూద్దాం. రూ. 2 లక్షలపై సాధారణ ప్రజలకు 6.45 శాతం వడ్డీ రేటు చొప్పున ప్రతి నెలా రూ. 1075 చొప్పున వడ్డీ వస్తుంది. మొత్తంగా 444 రోజులకుగానూ రూ. 15,050 వడ్డీ అందుతుంది. ఇదే క్వార్టర్లీ పే అవుట్ ఆప్షన్ ఎంచుకుంటే 3 నెలలకు ఓసారి రూ. 3225 చొప్పున అందుతుంది. ఇక్కడ ఓవరాల్‌గా వచ్చే వడ్డీ రూ. 12,900 కు తగ్గుతుంది. చివర్లోనే మొత్తం తీసుకుంటే మాత్రం రూ. 16,220 వడ్డీ అందుతుంది. ఇక సీనియర్ సిటిజెన్లకు చూస్తే 6.95 శాతం వడ్డీ రేటు ప్రకారం ప్రతి నెలా రూ. 1158 చొప్పున వడ్డీ వస్తుంది. ఇది మొత్తంగా రూ. 16,217 అవుతుంది. ఇది 3 నెలల ఆప్షన్ ఎంచుకుంటే రూ. 3475 చొప్పున మొత్తంగా రూ . 13,900 వడ్డీ అందుతుంది. అదే ఆఖర్లోనే తీసుకుంటే రూ. 17,520 వడ్డీ రూపంలో అందుతుంది.