నల్లమలలో వజ్రాల వేట.. అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ప్రజలు

Wait 5 sec.

నల్లమల అటవీ ప్రాంతం మరోసారి ఆశావాహులతో కిటికిటలాడుతోంది. వర్షాకాలం మొదలైందంటే నల్లమల ప్రాంతమంతా వజ్రాల వేటే. ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతుంటారు. కొంతమంది అయితే నెలల తరబడి ఇదే ప్రాంతంలో ఉంటూ వజ్రాల వేట కొనసాగిస్తారు. ముఖ్యంగా నంద్యాల - ఒంగోలు ప్రధాన మార్గంలోని నల్లమల అడవీలో ఉన్న ఎర్రవాగు వైపే అందరూ ప్రయాణిస్తారు. నల్లమల అడవీలో ఉన్న ఎర్రవాగులో జోరుగా వజ్రాల వేట కొనసాగుతోంది. నంద్యాల, కర్నూలు, మార్కాపురం, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని గ్రామాలకు చెందిన మహిళలు, పురుషులు ఎర్రవాగుకు చేరుకుని వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. వాగు వెంట నీటిలో జల్లెడ పడుతున్నారు. ప్రతి ఏటా వాగులో నీరు ప్రవహించే సమయాల్లో వజ్రాల కోసం ఈ అన్వేషణ కొనసాగుతుంది. నెల రోజుల వ్యవధిలో ఇటీవల కురిసిన సాధారణ వర్షాలకు నల్లమలలో నీటి ప్రవాహం జరిగింది. దాంతో ప్రజలు వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. గత నెలలో కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం జొన్నగిరిలో కూడా వజ్రాల వేట మొదలుపెట్టారు. జొన్నగిరి ప్రాంతంలో పొలాలకు వెళ్లి మరీ అన్వేషణ కొనసాగిస్తున్నారు. చిన్న వజ్రం దొరికినా తమ రాత మారుతుందనే ఆశతో ప్రజలు జల్లెడ పడుతున్నారు. READ ALSO ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురంలోని వజ్రకరూర్, కర్నూలు జిల్లాలోని తుగ్గిలి, జొన్నగిరి వీటితో పాటు నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణా నది తీర ప్రాంతాల్లో వజ్రాల వేట కొనసాగుతోంది. తొలకరి వర్షాలకు మట్టి కొట్టుకుపోయి వజ్రాలు బయటపడతాయని ప్రజలు భావిస్తుంటారు. ఈ ప్రాంతాల్లో దొరికే వజ్రాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లి సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఎర్రవాగు, రాళ్లవాగులో వర్షాకాలం వజ్రాల అన్వేషణ జోరుగా సాగుతుంది. గాజులపల్లి సమీపంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూర్వం స్వామి, అమ్మవార్ల కల్యాణానికి వజ్రాలను తలంబ్రాలుగా ఉపయోగించే వారని, అందుకే ఈ ప్రాంతంలో వజ్రాలు దొరికే అవకాశం ఉందని ప్రజలు భావిస్తారు. కేవలం స్థానికులే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.