న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)లో చోటుచేసుకున్న కీలక పరిణామాలపై కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్ట్ (KKNPP)లో డేటా లీక్ ఆరోపణలపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఎలాంటి డేటా లీక్ జరగలేదని ఆయన తెలిపారు. అలాగే, స్వచ్ఛంద పదవీ విరమణలు, రాజీనామాలపై నిబంధనలను కఠినతరం చేస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ ఆదేశాలు జారీ చేసింది.ఇస్రో మెమో గురించి అడిగిన ప్రశ్నకు సింగ్ సమాధానమిస్తూ.. అది కేవలం పరిపాలనా కారణాలతోనే జరిగిందని చెప్పారు. ‘‘లేదు, అది ఎందుకంటే... మరింత పరిణతి చెందిన స్థాయిలో నిర్ణయం తీసుకునేందుకు వీలుగా పరిపాలనా కారణాల వల్ల అలా చేశాం’’ అని కేంద్ర మంత్రి అన్నారు. ఇస్రోలో చాలా మంది ఉద్యోగులు ఉన్నారని, కొందరు వెళ్లిపోతుంటే మరికొందరు కొత్తగా చేరుతుంటారని ఆయన అన్నారు. ‘‘చాలా మంది వెళ్లారు, చాలా మంది వచ్చారు’’ అని చెబుతూ ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదని ఆయన స్పష్టం చేశారు. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో ఏమీ జరగనప్పుడు సమీక్షించాల్సిన అవసరం ఏముందని మంత్రి ప్రశ్నించారు.ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ చైన్నైకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అగ్నికుల్ కాస్మోస్‌ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అబ్జర్వర్‌గా చేరారు. జనవరి 2025 వరకు ఇస్రో ఛైర్మన్‌గా కొనసాగిన కాలంలోనే జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్, భారత్ తొలిసారిగా సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య- ఎల్1 వంటి పలు చారిత్రాత్మక మిషన్లు చేపట్టారు.ఇక, భారత భవిష్యత్తు అంతరిక్ష మిషన్లపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిస్తూ.. గతంలో ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్ వ్యాఖ్యలను గుర్తుచేశారు. ‘‘దాదాపు పదేళ్ల కిందట జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంతరిక్షంలోకి ఒక మనిషిని పంపడం సులభమే కానీ, తిరిగి సురక్షితంగా తీసుకురావడం కూడా అంతే కష్టంతో కూడుకున్న పని అని చెప్పారు.. ఆ విధంగానే క్రూ మాడ్యూల్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు సోమనాథ్ ఆ పదవిలో లేనంత మాత్రాన గగన్‌యాన్ మిషన్ ఆగిపోయిందని అర్థం కాదు. అలా జరగదు కూడా. పైగా ఇస్రోలో పనులు నిరంతరాయంగా సాగుతాయి. పదవీవిరమణ చేసినవారు, మాజీ శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టులలో భాగస్వాములుగా కొనసాగుతారు. అక్కడ పని సంస్కృతి చాలా భిన్నంగా ఉంటుంది’’ అని జితేంద్ర సింగ్ అన్నారు.యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ , విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వంటి ఇస్రో కేంద్రాలకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సోమవారం జారీ చేసిన అంతర్గత మెమోలో కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రతిష్టాత్మక మానవ సహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్', ఇతర ముఖ్యమైన మిషన్లతో ముడిపడి ఉన్న గ్రూప్ 'ఎ' సైంటిఫిక్, టెక్నికల్ సిబ్బంది రాజీనామాలను లేదా స్వచ్ఛంద పదవీ విరమణ అభ్యర్థనలను సాధారణ పద్ధతిలో ఆమోదించవద్దని ఆదేశించింది.