స్కూటీ నడుపుతూ బీరు తాగిన వ్యక్తి.. వీడియో వైరల్, కిక్కు దించేసిన పోలీసులు

Wait 5 sec.

హైదరాబాద్ నగరంలో మరోసారి నిర్లక్ష్య డ్రైవింగ్ కలకలం రేపింది. ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ.. ఓ వ్యక్తి స్కూటీ నడుపుతూనే బీర్ తాగిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన లక్డీకాపూల్‌లో జరిగిన ఈ ఘటన వాహనదారులను ఆందోళనకు గురిచేసింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్డీకాపూల్ ద్వారక హోటల్ జంక్షన్ సమీపంలో యాక్టివా స్కూటర్‌పై వెళ్తున్న ఓ యువకుడు ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకుని.. మరో చేత్తో బీర్ బాటిల్ పట్టుకుని మద్యం సేవిస్తూ ప్రయాణించాడు. రద్దీ ట్రాఫిక్ మధ్య అతడి ప్రమాదకర డ్రైవింగ్‌ను వెనుక వస్తున్న మరో వాహనదారుడు మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.వీడియో ఆధారంగా సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు, ఖైరతాబాద్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఆ స్కూటీ రిజిస్ట్రేషన్ నంబర్ వివరాల ఆధారంగా నిందితుడిని మల్లాపూర్‌కు చెందిన లక్ష్మణ్‌గా గుర్తించారు. వెంటనే లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని విచారణ చేశారు. తాను వాహనం నడుపుతూనే బీర్ తాగిన విషయాన్ని లక్ష్మణ్‌ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించినందుకు లక్ష్మణ్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదకర డ్రైవింగ్, ప్రజల భద్రతకు ముప్పు కలిగించడం వంటి ఆరోపణలపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నగర ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం మాత్రమే కాదు.. వాహనం నడుపుతూనే మద్యం సేవించడం మరింత ప్రమాదకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే వీడియోలు, ఫొటోలతో పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఆధారాలపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.