హమ్మయ్యా.. ఎట్టకేలకు, ఆ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పరిధిలో ఉన్న కొంతమంది ఉద్యోగులు పాత పెన్షన్ స్కీమ్‌లో (OPS) చేరేందుకు అవకాశం కల్పించింది. ఈ ఉద్యోగులకు వన్ టైమ్ ఆప్షన్ సౌకర్యం కల్పించింది. ఈ మేరకు జూలై 13వ తేదీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇది కేవలం ఒక్కసారి మాత్రమే ఎంచుకోగలిగే అవకాశమని, దీనిని ఎంచుకున్న ఉద్యోగులు తిరిగి సీపీఎస్‌లోకి మారలేరని ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ, CPSలోనే కొనసాగాలనుకునే వారు అలా కొనసాగవచ్చని పేర్కొంది. 2004 జనవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వంNPS (National Pension System) అమలు చేసిన ఎనిమిది నెలల తర్వాత.. 2004 సెప్టెంబర్ ఒకటో తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం CPS (Contributory Pension System) అమలు చేసింది. ఈ నేపథ్యంలో 2004 సెప్టెంబర్ ఒకటో తేదీ కంటే ముందు జారీ చేసిననోటిఫికేషన్ల ద్వారా ఎంపికై, సెప్టెంబర్ ఒకటి లేదా ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్‌ను ఎంచుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం కల్పించింది. అలాంటి ఉద్యోగులకు రిక్రూట్‌మెంట్ సమయంలోనే సీపీఎస్ వర్తించేలా రూల్ ఉండేది. అయితే తమను OPSకు మారేందుకు అనుమతించాలని కోరుతూ చాలా మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో 2023 మార్చి నెలలో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం NPS పరిధిలోని ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లోకి మారే అవకాశాన్ని కల్పించింది. ఆ రకంగానే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పాత పెన్షన్ విధానానికి మారాలనుకునే ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. వీటి ప్రకారం సదరు ఉద్యోగ నోటిఫికేషన్ తప్పనిసరిగా 2004 సెప్టెంబర్ ఒకటో తేదీకి ముందే జారీ చేసి ఉండాలి. అలాగే ఆ నోటిఫికేషన్‌కు అనుగుణంగా నియామకం 2004 సెప్టెంబర్ ఒకటో తేదీ లేదా ఆ తర్వాత జరిగి ఉండాలి. సదరు ఉద్యోగి ప్రస్తుతం సీపీఎస్ పరిధిలో ఉండాలి. అలాంటి ఉద్యోగులు తమ నియామక ఉత్తర్వులను, విధుల్లో చేరినట్లు తెలిపే పత్రాలను సమర్పించాలి.ఈ ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచి మూడు నెలల లోపు.. లేదంటే ప్రభుత్వం ప్రకటించే పొడిగించిన గడువు లోపు, ఉద్యోగి నిర్దేశిత నమూనాలో ఓపీఎస్ ఎంపికను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇచ్చిన వన్ టైమ్ ఆప్షన్ ఉపయోగించుకోని ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.