బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం: రెండు పడవలు బోల్తా.. 500 మందికిపైగా మృతి

Wait 5 sec.

మయన్మార్ తీరంలోని బంగాళాఖాతంలో రోహింగ్యా శరణార్థులతో వెళ్తున్న రెండు పడవలు బోల్తా పడి 500 మందికి పైగా మరణించినట్లు ఐక్యరాజ్యసమితి గురువారం ప్రకటించింది. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నుంచి బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాలకు ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్టు తెలిపింది. ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన పడవ ప్రమాదాల్లో ఇది ఒకటని ఐరాస పేర్కొంది. భారీ ప్రాణనష్టం పట్ల అంతర్జాతీయ వలసదారుల సంస్థ (ఐఓఎం), ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ (యూఎన్‌హెచ్‌సీఆర్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. జులై మొదటి వారంలో జరిగిన ఈ ఘటనలో బాధితుల గురించి కచ్చితమైన వివరాలు అందుబాటులో లేవని ఐరాస వివరించింది.రుతుపవన వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. శరణార్థులతో మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నుంచి జూన్ చివరి వారం ఈ పడవలు బయలుదేరాయి. ఇందులోని ప్రయాణికులు బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాలకు చెందినవారని భావిస్తున్నారు. దాదాపు 250 మందితో వెళ్తున్న పడవల్లో ఒకటి.. తీరం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే సంబంధాలు కోల్పోయింది.అలాగే, జులై 8న మయన్మార్‌ అయేయార్వాడి నది తీరంలో 280 మందితో ప్రయాణిస్తున్న మరో పడవ బోల్తా పడినట్లు సమాచారం. రుతుపవనాలు, తుఫాన్ల కారణంగా బంగాళాఖాతంలో ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో రోహింగ్యాలు అరుదుగా ప్రయాణిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఈ ఘోరమైన విపత్తు సంభవించింది. రుతుపవనాల కారణంగా ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, విస్తృతమైన వరదలతో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారి ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి సంస్థలు పేర్కొన్నాయి.మయన్మార్‌ రఖైనా రాష్ట్రంలో తీవ్ర హింస, పేదరికం నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో భాగంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సైనిక అణచివేతతో ఆ దేశం నుంచి పారిపోయి వచ్చిన సుమారు 12 లక్షల మంది బంగ్లాదేశ్‌లోని కిక్కిరిసిన శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మయన్మార్‌లో ఉన్నవారు తీవ్రమైన ఆంక్షలతో నిర్బంధ శిబిరాల్లోనే జీవించాల్సిన పరిస్థితులు నెలకున్నారు., అండమాన్ సముద్రంలోని ఈ మార్గం ఇటీవలి సంవత్సరాలలో చిన్నారులు, గర్భిణీలు సహా వేలాది మంది రోహింగ్యాల ప్రాణాలను బలితీసుకుంది. ఐరాస శరణార్థుల సంస్థ ప్రకారం.. గతేడాది ఈ ప్రమాదకర ప్రయాణానికి ప్రయత్నించిన 6,500 మందికి పైగా రోహింగ్యాల్లో దాదాపు 900 మంది మరణించారు లేదా గల్లంతయ్యారు. ఇలాంటి ప్రయాణాల చరిత్రలో ఇదే అత్యంత ఘోరమైన ఏడాది. ప్రపంచం ప్రధాన శరణార్థుల సముద్రయానాల్లో ఈ మార్గంలోనే ప్రస్తుతం అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని యూఎన్‌హెచ్ఆర్సీ ఆందోళన వ్యక్తం చేసింది.